లండన్‌లో ఘనంగా గోదారోళ్ళ సంక్రాంతి వేడుకలు

    14
    0

    లండన్ : బ్రిటన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచే గోదారోళ్ళ సంక్రాంతి వేడుకలు 2026 అత్యంత వైభవంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరై, స్వదేశీ సంస్కృతి, సంప్రదాయాలకు పునర్జీవనం పోశారు.

    సంక్రాంతి ప్రత్యేకతను చాటేలా భోగి మంటలు, ముగ్గుల పోటీలు, హరిదాసుల కీర్తనలు, గొబ్బెమ్మల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ చీరల్లో, పురుషులు పంచెకట్టుతో హాజరై పండుగ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చారు.

    సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల నుండి పెద్దల వరకు నిర్వహించిన నృత్యాలు, జానపద గీతాలు, డప్పు ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోదావరి ప్రాంతపు జానపద నృత్యాలు, పాటలు లండన్ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ ఏడాది గోదారోళ్ల పెళ్లి సందడి మూలాంశం ఎంతో విశేషంగా నిలిచింది. నిర్వాహకులే కాకుండా వచ్చిన అతిథులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగాలకు లోనయ్యారు.

    ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ “విదేశాల్లో ఉన్నా మన తెలుగు సంప్రదాయాలు, పండుగలను మన పిల్లలకు పరిచయం చేయడమే గోదారోళ్ల సంక్రాంతి లక్ష్యం” అని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఈ వేడుకలు నిర్వహించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. లండన్‌లో జరిగిన గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు, తెలుగు సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో ఉన్న గుర్తింపుకు నిదర్శనంగా నిలిచాయి.

    గోదావరి ప్రాంత సాంప్రదాయ వంటకాలలో భాగంగా పనసపొట్టు పలావు, తోటకూర లివర్ ఫ్రై, వంకాయ పచ్చడి, జీడిపప్పు కూర, దొండకాయ, ఆవకాయ, గుమ్మడికాయ హల్వా, కోడికూర – చిల్లుగారె, చింతకాయ – రొయ్యల కూర అరిటాకులలో తామే వండి కొసరి కొసరి వడ్డిస్తూ గోదావరి వెటకారాన్ని, యాసని మమకారాన్ని గుర్తు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆసక్తికరంగా నిర్వహించడం స్థానికులని, పచ్చిన అతిధులను అబ్బర పరిచింది. యుకెలో వెయ్యి మంది ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలే కాక వివిధ తెలుగు ప్రాంతాలకు చెందినవారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కార్యాక్రమాన్ని విరాజవంతం చేసారని నిర్వాహకులు తెలిపారు.

    పిల్లల సాంస్కృతిక ప్రదర్శన ప్రేక్షకుల మనసులను ఆకర్షించి వారిని మంత్ర ముగ్ధులను చేసింది. ఈ సంవత్సరం గోదావరి పండుగ ముఖ్యాంశం ఏమిటంటే స్థానికంగా స్థిరపడిన తెలుగు ప్రజలతో పాటు బ్రిటిష్ ప్రజలు కూడా రావడం మేము గమనించాము. మన సంక్రాంతి పండుగ, సంప్రదాయాలు, సంస్కృతి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో వారు చాలా ఆసక్తి చూపారు. వారికి చూపుతున్న ఆతిథ్యంతో వారు మంత్ర ముగ్దులు అయ్యారు.