ముంబయి : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘సంజు’ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ.200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో చిత్రీకరించారు. విక్కీ కౌశల్, మనీషా కొయిరాలా, పరేశ్ రావల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, దియా మీర్జా, టబు, షియాజీ షిండే ప్రధాన పాత్రలు పోషించగా ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.34.75 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు రణ్‌బీర్, రాజ్‌కుమార్ సినీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంకూడా. ఇది మూడు రోజుల్లో రూ.120 కోట్లకుపైగా రాబట్టి మరో సంచలన రికార్డు సృష్టించింది.
మంగళవారానికి రూ.167.51 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. శుక్రవారం రూ.34.75 కోట్లు, శనివారం రూ.38.60 కోట్లు, ఆదివారం రూ.46.71 కోట్లు, సోమవారం రూ.25.35 కోట్లు, మంగళవారం రూ.22.10 కోట్లు కలిపి రూ.167.51 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. ఈ సినిమా రూ.200 కోట్లకుపైగా వసూలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.