Home జాతీయం ఆర్ఎస్ఎస్ ఆఫీసు కేంద్రంగా మోడీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు…?

ఆర్ఎస్ఎస్ ఆఫీసు కేంద్రంగా మోడీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు…?

526
0

ఢిల్లీ : మోడీ పాలనలో మసకబారుతున్న బిజెపి ప్రతిష్ఠ నిలుపుకునేందుకు బిజెపి మాతృ సంస్థ తంటాలు పడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నేతను వెతికే పనిలో ఆర్ఎస్ఎస్ తలమునకలైందా? వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు మోడీ ముఖం పెట్టుకుని వెళ్తే పరాజయం తప్పదని సంఘ్పరివార్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారా? అంటే… జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే …ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇటీవల ఆర్ఎస్ఎస్ తీసుకున్న ఒక నిర్ణయం ఢిల్లీ రాజకీయాల్లో వేడి పెంచింది. దీని దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2019 ఎన్నికలకు కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రధానిగా రంగంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావించవలసి వస్తోంది. వచ్చే నెల్లో జరిగే ఆరెస్సెస్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రణబ్‌ ముఖర్జీ అంగీకరించడం.. గతకొద్ది రోజులుగా తెరవెనుక జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. ఈమేరకు కీలక సంకేతాలు ఇస్తున్నాయి.

ఆరెస్సెస్‌ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్‌ అంగీకరించడం రాజకీయ వర్గాల్లో పెను ఆసక్తినే రేకెత్తించింది. రాష్ట్రపతి పదవి నుంచి విరమణ చేసినప్పటికీ తానింకా క్రియాశీల రాజకీయాలకు దూరం కాలేదని ప్రణబ్‌ ముఖర్జీ దీని ద్వారా సందేశం ఇచ్చినట్లైయింది. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ ట్విటర్‌లో తననుతాను సిటిజన్‌ ముఖర్జీగా ప్రస్తావించుకుంటారు. తద్వారా తాను ‘స్వతంత్ర’ పౌరుడిననే సందేశాన్ని ఇస్తారు. ఈ సంకేతాలకు అనుగుణంగానే ఆయన తాజా చర్యలు ఉంటున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గత జనవరిలో బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సందర్భంగా.. భువనేశ్వర్‌లో ఒడిసా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌తో ప్రణబ్‌ ఒక విందు సమావేశం జరిపారు. సోనియాగాంధీ, శరద్‌ పవార్‌ ఇచ్చిన విందులాగా మీడియాలో దీనిపై ఎక్కడా హడావుడి జరగలేదు. అయితే, ఈ సమావేశానికి దేవెగౌడ, సీతారాం ఏచూరి, ఎల్‌కే అద్వానీ హాజరయ్యారు. పేరుకిది బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సమావేశమే అయినా నిజానికి మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించిన కీలక సందర్భం కూడా అని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. దానికి కొద్దినెలల ముందు ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే.. నవీన్‌ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. బెంగాల్‌ వాస్తవ్యులైన దాదాకు, దీదీకి మధ్య ఆది నుంచీ సత్సంబంధాలున్నాయి.

‘‘భారత్‌కు ఆయన ప్రధాని కాని ప్రధాని’’ అని ప్రణబ్ కు ఢిల్లీ రాజకీయవర్గాల్లో పేరుంది. యూపీఏ ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్‌ అయినప్పటికీ ఆ సంకీర్ణాన్ని కాచివడపోసింది ప్రణబ్‌ముఖర్జీయే. సంకీర్ణ రాజకీయాలపై రాసిన పుస్తకంలో ప్రణబ్‌ ఈ విషయాన్ని ఘనంగా చెప్పుకొన్నారు కూడా. యూపీఏ-2 ఏర్పాటైనప్పుడు సోనియాగాంధీ తనను ప్రధానిని చేస్తారని, మన్మోహన్‌ సింగ్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తారని ఆశించినట్టు కూడా ప్రణబ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో రాష్ట్రపతిగా రిటైరైన ఈ తరుణంలో ఆయన మరో ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్‌, బీజేపీ, తృణమూల్‌, బీజేడీకి సంబంధించిన రాజకీయ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. దేశంలోని అన్ని పార్టీలతో సంబంధాలు, ఆమోద యోగ్యత రెండూ ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం.

అందుకే.. ‘‘ప్రణబ్‌ రాజనీతి దురంధరుడు. మోదీకి సాటి రాగల స్థాయి ఉన్నది ఆయన ఒక్కరికే’’ అని బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో కీలకపాత్ర పోషించడానికి ప్రణబ్‌ సిద్ధంగా ఉన్నారని ఆ ఎంపీ వివరించారు. బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని ఆరెస్సెస్‌ పట్టుదలగా ఉంది. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాతుకుపోతుందన్నది దాని భయం. అందుకే.. అది ప్రత్యామ్నాయ వ్యూహాల మీద సీరియ్‌సగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటయ్యే ఫ్రంట్‌ వెనుక రహస్య అస్త్రమే ప్రణబ్‌ అని ఒక జాతీయ ఛానల్ వర్గాలు విశ్లేషించాయి.

ఇకపోతే.. ఆరెస్సెస్‌ సమావేశానికి ప్రణబ్‌ హాజరు కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు. దీనిపై ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు ‘నో కామెంట్‌’ అన్నారు. ప్రణబ్‌ నిర్ణయం కాంగ్రెస్‌ నేతలకు రుచించకపోయినా.. ఆయనను కట్టడి చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నా ప్రధానమంత్రి పదవి ప్రణబ్‌కు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే రాహుల్‌ ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తమ సమావేశానికి ప్రణబ్‌ రావడాన్ని ఆరెస్సెస్‌ వర్గాలు ఘనవిజయంగా చెప్పుకొంటున్నాయి. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ అయితే.. సంఘ్‌ పట్ల ఇన్నాళ్లూ ఉన్న రాజకీయ అంటరానితనానికి ప్రణబ్‌ చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. అంటే మోడీకి ప్రత్యామ్నాయ అన్వేష్గణలో ఆర్ఎస్ఎస్ తీవ్రంగా కృషి చేస్తున్నదనడంలో సందేహం లేదనుకుంటా…!