Home ఆంధ్రప్రదేశ్ చిన్న పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రుణాలు

చిన్న పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రుణాలు

263
0

చారిత్రాత్మక నిర్ణయం చిత్తశుద్ధితో అమలు జరిగితేనే ప్రయోజనం
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రతినిధి వి భక్తవత్సలం

ఒంగోలు : దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రూ.3లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రతినిధి వి భక్తవత్సలం పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గం సంపూర్ణంగా స్వాగతిస్తుందన్నారు. దేశంలో 45లక్షల ఎమ్మెస్ఎంఈలు ఉన్నారు. 12కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ఇదే సందర్భంలో 40లక్షల యూనిట్లు మూతపడటంతో 15కోట్ల మందికి ఉపాధి చూపాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 9.1వృద్ధిరేటు సాధించిన ఈ రంగాలు క్రమంగా 5శాతానికి పడిపోయాయి. 40శాతం ఎంఎస్ఎంఈలు ఎన్పిఏతో సతమతమవుతున్నారు. దీనివల్ల రూ.5లక్షల కోట్ల జిడిపి సాధించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరేలా కనబడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు అందక మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి లాక్‌డౌన్‌ కు ముందే ఈ రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లాక్ డౌన్లోడ్ తో మరింత సంక్షోభంలోకి వెళ్లాయి. ఇప్పట్లో కోలుకోవాలంటే గరిష్ఠంగా ఏడాది సమయం పడుతుంది.

ఈ సందర్భంలో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఎంఎస్ఎంఈలకు ఊపిరిపోసినట్లయింది. రూ.3లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని తరగతుల వారీగా విభజించడం, అవసరాల ప్రాతిపదికగా సహాయం అందించడం కోసం ముందుకు రావడం ముదావహం. ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈ లకు రూ.20వేల కోట్లు, రూ.50వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకుల నుండి రుణ వితరణ, 12 నెలల పాటు మారటోరియం, ఎమ్మెస్ఎంఈల పరిమితులను, పరిధులను పెంచడం, సిఎస్టిఎస్ఎంఈలో రూ.400కోట్ల రుణాలు అందించేందుకు నిర్ణయించడం మంచిదే. ఆపత్కాలంలో తీసుకున్న నిర్ణయాలు కచ్చితంగా ఐసీయూలో ఉన్న ఈ రంగానికి ఆక్సిజన్ లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత పెద్ద సంఖ్యలో ఉపాధిని, జీడీపీలో భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు రంగం ఇదే. వ్యవసాయంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఉంటుంది. ఈ రంగంలో నిరంతరం ఉపాధి ఉంటుంది. చిన్న పరిశ్రమల సర్క్యులేషన్ నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. దేశ మానవాళికి అవసరమైన వస్తు ఉత్పత్తి అందించడంతోపాటు భారీ పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులను ఈ రంగం నుండి సరఫరా కావాల్సి ఉంది.

మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్ రంగాలకు విస్తరించిన ఎంఎస్ఎంఈలు విదేశీ మారక ద్రవ్యాన్ని అందించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వాస్తవానికి ఎంఎస్ఎంఈ లకు ప్రతి సంవత్సరం రూ.16లక్షల కోట్ల రుణ పరపతి అవసరం ఉంటుంది. ఇందులో 10శాతం కూడా బ్యాంకుల నుంచి ఎంఎస్ఎంఈలు రుణలను పొందలేక పోతున్నాయనేది నిర్వివాదాంశం. కేంద్రం ప్రకటించిన అంశాలలో టిడిఎస్ 25% తగ్గింపు రూ.2500ఈపీఎఫ్ లను ప్రభుత్వం తానే ఎమ్మెస్ఎంఈల తరుపున చెల్లించేందుకు ముందుకు రావడం శుభపరిణామం. ప్రభుత్వ ఆదాయం తగ్గినా ఈ నిర్ణయం సాహసోపేతంగా పరిగణించాల్సి ఉంటుంది.

*చిత్తశుద్ధితో అమలు జరిగితేనే మేలు చేకూరుతుంది*

కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్యాకేజీలకు ప్రస్తుతం ప్రకటించిన ఈ ప్యాకేజీకి స్పష్టమైన తేడా ఉంది. ప్రధానంగా ఐదు రంగాలను స్వయం సమృద్ధిగా పటిష్టపరిచేందుకు తీసుకున్న నిర్ణయంగా చూడాల్సి ఉంది. ఎమ్మెస్ఎంఈలకు 15శాతం కేటాయించడం చారిత్రక అవసరంగా ప్రభుత్వం పరిగణించిందని చెప్పవచ్చు. పలువురు ఆర్థిక నిపుణులు ఈ మొత్తం కేటాయింపులు కావని, ప్రభుత్వ పాలసీగానే చూడాలని చెప్పడాన్ని విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

*ప్రాక్టికల్గా సవాళ్లను చర్చించాల్సి ఉంది.*

కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ ఎంత స్పష్టంగా తమ విధానాలను ప్రకటిస్తున్నప్పటికీ బ్యాంకుల సహకారం అంతంతమాత్రంగానే ఉంటుంది. చాలా సింపుల్ గా, నార్మల్ గా తీసుకుంటున్నాయనేది వాస్తవం. నిజంగా రుణం అవసరమైన వారికి బ్యాంకులు సహకరించడం లేదు. మానిటరింగ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు జరిపితే ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుంది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటు తగ్గించినందువలన బ్యాంకులు రుణ ప్రవాహాన్ని నిరంతరాయంగా అమలు జరపాలి. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేటాయించిన రూ.10వేల కోట్లను బ్యాంకులు సక్రమంగా ఎంఎస్ఎంఈలకు బదిలీ చేసే విధంగా మానిటరింగ్ ను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు క్రింది స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ముడిసరుకు లభ్యత, మార్కెటింగ్, కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కార్మికులు అందరూ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ ప్యాకేజీని 15రోజుల ముందు ప్రకటించి ఉన్నట్లయితే పారిశ్రామిక వర్గం కార్మికులను నిలుపుకునే అవకాశం ఉండేది. ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఖచ్చితంగా అమలు జరిగే మెకానిజం, మేనేజ్మెంట్ ను ప్రభుత్వం సమకూర్చుకోవాలి ఉంది.