ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలయికలో క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. నిజాం నిరంకుశ పాలనను ఎండగట్టిన కొమరం భీమ్, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రల స్ఫూర్తితోరాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే మొదలైన దగ్గర నుంచీ ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది.
షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే రామ్‌చరణ్.. ఆ తర్వాత ఎన్టీఆర్ వరుసగా గాయపడ్డారు. అలాగే తారక్ కోసం ముందుగా అనుకున్న ఫారెన్ బ్యూటీ హ్యాండిచ్చింది. ఇలాంటి కారణాలతో ‘ఆర్.ఆర్.ఆర్’ షెడ్యూల్స్ అనుకున్న సమయానికి పూర్తవ్వలేదు.
అయినా అన్ని అడ్డంకులు దాటుకుని దర్శకధీరుడు రాజమౌళి.. ఈ చిత్రం షూటింగ్‌ను ఇప్పటికే చాలా భాగం పూర్తిచేశాడు. కానీ ఈ సారి ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, అలియా భట్ వలన ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి ఉందట.
‘ఆర్.ఆర్.ఆర్’లో కీలక పాత్రలు పోషిస్తున్న అజయ్ దేవగణ్, అలియా భట్.. బాలీవుడ్‌లో బిజీయెస్ట్ ఆర్టిస్టులు. ప్రస్తుతం అజయ్ దేవగణ్ బాలీవుడ్‌లో హిస్టారికల్ మూవీ ‘తానాజీ’, ఇండో-పాక్ వార్ డ్రామా ‘భుజ్ – ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’, స్పోర్ట్స్ బేస్డ్ మూవీ
‘మైదాన్’ వంటి వాటికి కథానాయకుడిగా-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు అలియా భట్.. ప్రియుడు రణ్‌బీర్‌తో సూపర్‌హీరో మూవీ ‘బ్రహ్మాస్త్ర’.. తన తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో ‘సడక్-2’ సినిమాలతో బిజీగా ఉంది. ఇలా అజయ్, అలియా తమ హిందీ సినిమాలతో నిమగ్నమై ఉండడం వలన ‘ఆర్.ఆర్.ఆర్’కి డేట్స్‌ను సర్దుబాటు చేయలేక పోతున్నారట. దాంతో వచ్చే యేడాది జూలై 30న విడుదలవ్వాల్సిన రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ ఐదు నెలలు ఆలస్యంగా 2021 సంక్రాంతి బరిలో రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోయే దర్శకధీరుడు ఈ అవాతంరాలన్నీ దాటుకుని అనుకున్న సమయానికే ‘ఆర్.ఆర్.ఆర్’ని తీసుకొస్తాడేమో చూడాలి.