•ఎమ్మెల్యే ఏలూరి కృషితో రహదారుల పునరుద్ధరణ
•ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు
•రూ.5.40 కోట్లతో మరమ్మత్తు పనులకు గ్రీన్ సిగ్నల్
పర్చూరు (DN5 News) : నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ ప్రారంభమైంది. అభివృద్ధికి దిశా నిర్దేశంతో రహదారులు నూతన సొబగులతో రూపుదిద్దుకోనున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంతలతో నిండిన రహదారులు, అస్తవ్యస్తంగా దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణ సౌలభ్యం లేక రైతులు, విద్యార్థులు, ప్రయాణికులు రోజూ కష్టాలు పడాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నిరంతర కృషి ఫలితంగా కీలక ఆర్ అండ్‌బి రోడ్ల అభివృద్ధికి రూ.5.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు జీఓ ఆర్టీ నం.115 విడుదల చేస్తూ రోడ్లు భవనాలు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించి, ప్రయాణానికి అనుకూలమైన రహదారులుగా మెరుగుపరచి అభివృద్ధి చేయడం తమ లక్ష్యం అన్నారు. ప్రజలకు సురక్షిత, సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధాన జీవనాధారం కావడంతో రైతులు తమ పంటలను మార్కెట్‌కు తరలించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ పనులు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
అభివృద్ధి దిశగా పర్చూరు
నియోజకవర్గంలో అభివృద్ధి వేగం పెరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్డు పనులు మంజూరవుతాయని ఎమ్మెల్యే ఏలూరి ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో గుంతల రహదారులతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వంలో నూతన రహదారులు కళకళ లాడుతున్నాయన్నారు.
మంజూరైన రోడ్డు పనుల వివరాలు
తిక్కరాజుపాలెం, చెరుకూరు రోడ్డు మరియు గర్నేపూడి, తిక్కరాజుపాలెం రోడ్డుకు రూ.2.80 కోట్లు, యద్దనపూడి నుంచి జాగర్లమూడి (వయా చిమటవారిపాలెం) రూ.20 లక్షలు, అనంతవరం, చెన్నుపల్లి రూ.15 లక్షలు, కారంచేడు, కుంకలమర్రుకు రూ.25 లక్షలు, వేటపాలెం నుండి సంతరావూరుకు రూ.25 లక్షలు, వంకాయలపాడు నుండి కొడవలివారిపాలెంకు రూ.10 లక్షలు, పాత మద్రాస్ రోడ్డు నుండి అంబటివారిపాలెంకు రూ.15 లక్షలు, ఇంకొల్లు నుండి సంతరావూరుకు రూ.10 లక్షలు, కారంచేడు నుండి ఇంకొల్లుకు రూ.15 లక్షలు, ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ నుండి ఏటిమొగ రోడ్డుకు రూ.25 లక్షలు, నూతలపాడు నుండి కారంచేడుకు రూ.55 లక్షలు, బల్లికురవ నుండి ఎన్‌హెచ్5 వరకు రూ.20 లక్షలు, ఎన్‌హెచ్5 నుండి నాగండ్ల రోడ్డుకు రూ.25 లక్షలు మంజూరు చేశారు.






