– ట్రాక్టర్ల యజమానులకు సబ్సిడీ మంజూరుకు ప్రకాశం కలెక్టర్ అంగీకారం
– మంత్రి గౌతమ్‌రెడ్డి చొరవతో ఎపిఐఐసి ప్లాట్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం
– రెండు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రతినిధి వి భక్తవత్సలం
దళిత పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. అధికారులు, మంత్రుల చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకారంతో ఊరట లభించింది. ఎన్నోఎళ్లుగా దళిత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు జఠిలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం దొరికింది. గత ప్రభుత్వంలో నిబంధనల పేరుతో అడ్డంగా చూపిన అధికారులు తాజాగా ఐటి, పారిశ్రామిక మాత్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి కృషితో కదిలారు. ట్రాక్టర్ల సబ్సిడీ మంజూరుకు ప్రకాశం కలెక్టర్ పోలా భాస్కర్ అంగీకారం తెలుపగా ఎపిఐఐసి గుల్లాపల్లి గ్రోత్ సెంటర్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక ప్లాట్ల సమస్యకు ఉపప్రణాళిక నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో రెండు ప్రధాన సమస్యల పరిష్కారంతో ఆయా పరిశ్రామిక కేంద్రాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. దళిత పారిశ్రామిక వేత్తల సమాఖ్య ప్రతినిధి వి భక్తవత్సలం నేతృత్వంలో పారిశ్రామికవేత్తల బృంధం రెండు సమస్యలను అధికారులు, మంత్రులకు వివరించడంతోపాటు ప్రభుత్వ సానుకూల స్పందన ఊరట నిచ్చింది.
రాష్ట్రస్థాయిలో ఎపిఐఐసి ప్లాట్ల సమస్య, ట్రాక్టర్ల సబ్సిడీ సమస్యలకు గత ప్రభుత్వం అనాలోచితంగా ఇచ్చిన జిఒలు, వాటిని అ నుసరించి రూపొందించిన మార్గదర్శకాలు మరింత ప్రతిబంధకంగా మారాయి. దీంతో ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈ ఊబి నుండి బయటకు రాలేకపోయాయి. గత ప్రభుత్వం ఇచ్చిన అనాలోచిత జిఒలను, మార్గదర్శకాలను ప్రస్తుత అధికారులు, మంత్రులకు వివరించడంతోపాటు ప్రత్యామ్నయం చూపడంలో బక్తవత్సలం బృంధం కృషి చేసింది. ఏడు సంవత్సరాలుగా ఎపిఐఐసి ప్లాట్ల సమస్య వెంటాడింది. నలుగురు ముఖ్యమంత్రులు, నలుగురు మంత్రులు, 7గురు ఎపిఐఐసి ఎండిలు మారినా ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల తలరాతలు మారలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకువచ్చింది. గత 20రోజులుగా ఈ సమస్యను మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలోనూ, పరిష్కారం దిశగా ప్రయత్నించడంలోనూ ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తల బృంధం శ్రమించింది. ఈ బృంధానికి నాయకత్వం వహించిన భక్తవత్సలంతోపాటు ఐ సుందరరావు, కోటయ్య, ఆల్బర్ట్ ఉన్నారు.
గుల్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో సమస్య ఏమిటి?
2008 నుండి గుళ్లపల్లి గ్రోత్ సెంటర్‌లోనూ రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక వాడలలోనూ ప్లాట్లు పొందిన ఎస్‌సి, ఎస్‌టి యజమానులకు ప్రభుత్వం ఇచ్చిన జిఒలు పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు ప్రతిబంధకంగా మారాయి. జిఒ నెం.102తో 16శాతం వడ్డీ, 10సంవత్సరాల లీజును ప్రతిపాదించారు. ఈ జిఒ పరిశ్రమల స్థాపనకు శరాఘాతమైంది. ఒక్క గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లోనే రూ.25కోట్ల దాకా ప్లాట్ల కోసం వెచ్చించిన ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తలకు ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలాగా మారింది. ఈ కాలంలో ఈ ప్లాట్ల ధరలు పెరుగాయి. దానికి వడ్డీ, అపరాధ వడ్డీతోడై తడిసి మోపెడైంది. ఇఒటిలకు అనుమతి లభించక అల్లాడి పోయారు. ఈ ఊభి నుండి బయటపడాలంటే సబ్‌ప్లాన్ నిధులనుండి ఎపిఐఐసికి ప్యాకేజీ రూపంలో చెల్లించడం తప్ప మరో మార్గం లేదని విన్నవించారు. గత ప్రభుత్వాల కాలంలో ఎన్ని మార్లు ఘోషించినా సబ్‌ప్లాన్ నిధులు మురిగబెట్టడమో… పక్కదారి మళ్లించడమో చేశారేతప్ప ఆదుకున్నది లేదు. ఎట్టకేలకు అనేక విజ్ఞప్తుల మేరకు రాష్ట్రపరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఒక ప్యాకేజీ విడుదలకు అంగీకరించారు. ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తల ప్రతినిధులు ఇటీవల నెల్లూరులో మంత్రి గౌతమ్‌రెడ్డిని కలిసిన సమయంలో ఆయన హామీ ఇచ్చారు. అంతకు ముందు ఈ అంశంపై ఎపిఐఐసి ఎండి మారెడ్డి ప్రతాప్ ప్రత్యేక చొరవ చూపాచారు. ముఖ్యమంత్రి జగన్, సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులతో చర్చించారు. మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి సమస్యను క్షుణ్ణంగా వివరించారు. తొలివిడతగా మొత్తం 1400మంది ఔత్సాహికులలో 176మందికి ఈ ప్యాకేజీ వలన ప్రయోజనం జరగనుంది. ఇంకా సేల్ రిజిస్ర్టేషన్ చేయించుకున్న వారికి సేల్ డీడ్ ఇవ్వాలని, అధికారికంగా రద్దు చేసిన ప్లాట్లను తిరిగి పునరుద్దరించేందుకు అవకాశం కల్పించాలని భక్తవత్సలం కోరారు.