ఒంగోలు : ప్రకాశం జిల్లా కమ్యునిస్టు ఉధ్యమ నిర్మాణంలో ఒకరైన కామ్రేడ్ పమిడి కోటయ్య ఒంగోలులోని ఆయన నివాసంలో సోమవారం వేకువజామున కన్నుమూశారు. ఆమన మరణవార్త తెలుసుకున్న సిపిఎం, సిపిఐ నేతలు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పమిడి కోటయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని, జిల్లాలో కమ్యునిస్టు ఉధ్యమ నిర్మాణంలో కోటయ్య కృషిని గుర్తు చేసుకున్నారు. నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకుడు కోటయ్య అని సిపిఐ నేత నల్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. 1951లో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తివేత అనంతరం అడవుల నుండి బయటికి వచ్చాక 1952 నుండి 1955 వరకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ యువజన సంఘానికి జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలుగా కోటయ్య, తాను పనిచేసామని చెప్పారు. కోటయ్య ఆధ్వర్యంలో సంతనూతలపాడు సమితి ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ జయకేతనం ఎగురవేసిందని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పేదల పక్షాన అనేక ఉద్యమాలు చేసిన ఘనత కోటయ్యకు ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. కమ్యునిస్టు పార్టీలో చీలిక అనంతరం సిపిఎంకు జిల్లా తొలికార్యదర్శిగా సేవలందించారని సిపిఎం నేతలు పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, రాష్ట్ర కమిటి సభ్యులు జాలా అంజయ్య, సిపిఎం రాష్ట్ర నాయకులు వై సిద్దయ్య, జిల్లా నాయకులు జివి కొండారెడ్డి ఉన్నారు.