చీరాల (DN5 News) : రెడ్ క్రాస్ సేవలు విస్తృతం చేయనున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ చెప్పారు. స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విపత్తు తర్వాత రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలలో జాప్యం ఏర్పడినప్పటికి అనంతరం నూతన కార్యవర్గం ఏర్పాటు అయిన తరువాత యధావిధిగా రెడ్ క్రాస్ సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. 1917లో భారతదేశంలో మొట్టమొదటి సారి ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా భారతదేశంలో రెడ్ క్రాస్ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు.

చీరాల పేరాల ఉద్యమ నేపథ్యంలో గోపాలకృష్ణయ్య చీరాల వచ్చిన అనంతరం చీరాల నుండే జాతీయ స్థాయిలో రెడ్ క్రాస్ సేవలు ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పట్లో చీరాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల, తల్లి బిడ్డ సంరక్షణ కోసం మాతా శిశు పోషణాలయం ప్రారంభించి అనేక సేవలు అందించారని చెప్పారు. చీరాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహించబడుతున్న అంబులెన్స్ సేవలను యధావిధిగా కొనసాగించ నున్నట్లు తెలిపారు. నామమాత్రపు రుసుముతో అంబులెన్స్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల చివరి శనివారం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రెడ్ క్రాస్ సేవలు విస్తృత పరిచేందుకు నిరుపయోగంగా ఉన్న రెడ్ క్రాస్ భవనాన్ని ఆధునికరించి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వసిష్టా చేతుల మీదుగా పున ప్రారంభం చేసినట్లు తెలిపారు. రెడ్ క్రాస్ సేవల విస్తృత చేయనున్న సందర్భంగా ఆసక్తి కలిగిన సేవా తత్పరులను రెడ్ క్రాస్ సభ్యులుగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. త్వరలో రక్త నిధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ సూరంపల్లి తేజస్విని, ట్రెజరర్ తాడివలస కుమార్, ఎంసీ నెంబర్లు పసుపుల వందనం, జంగిలి కృష్ణ, దమ్ము విజయ భాస్కర్, తడవర్తి చంద్ర శేఖర్, ఇ.సి. సభ్యులు పవన్ కుమార్, కాటి రామారావు, నారాయణo వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






