చీరాల, మార్చి 09 (DN5 News) : ఆటోనగర్‌లో వాస్తవ లబ్ధిదారులైన గతంలో డీడీలు కట్టిన ఆటోమొబైల్ కార్మికులకు స్థలాలు కేటాయించాలని కోరుతూ ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ వి వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆటోమొబైల్ షాపులు నిర్వహించే మెకానిక్‌లు, బాడీ బిల్డర్లు, టైర్ మెకానికులు, వెల్డర్లు, ఫౌండ్రీ కార్మికులకు సంబంధించిన చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అమ్ముకుంటూ జీవించే చిరు వ్యాపారుల కోసం అప్పటి ప్రభుత్వం పట్టణ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆటోనగర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వివరించారు. ఆ మేరకు 1985లో ఆటోనగర్ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించి సాల్వేషన్ ఆర్మీకి చెందిన 30 ఎకరాల భూమిని కార్మికులు డీడీల రూపంలో చెల్లించిన రూ.20 లక్షలతో కొనుగోలు చేశారని తెలిపారు.
అదేవిధంగా ఈపురుపాలెం పంచాయతీ పరిధిలో మరో 10 ఎకరాల భూమిని సేకరించి ఆటోనగర్ పనులు ప్రారంభించారని వివరించారు. అయితే కొందరు స్థానికులు ఆ భూమి తమదని కోర్టును ఆశ్రయించడంతో చాలాకాలం పనులు నిలిచిపోయాయని చెప్పారు. కోర్టు కేసుల కోసం రూ.లక్షల్లో కార్మికులు చందాలు వేసి ఖర్చు చేశామని తెలిపారు. ఆ భూమిని ఇసుక దొంగల నుండి కాపాడుతూ ఇప్పటి వరకు సంరక్షించామని పేర్కొన్నారు. అనంతరం 2017లో కోర్టు తీర్పు ఆటోమొబైల్ కార్మికులకు అనుకూలంగా వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో రోడ్లు, కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అయితే గత రెండేళ్లుగా ఆటోమొబైల్ కార్మికులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా కొందరు వ్యక్తులు ఎపిఐఐసి అధికారులతో కుమ్మక్కై బాపట్ల, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారికి అక్రమంగా తమ స్థలాలు కేటాయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
35ఏళ్లుగా స్థలాన్ని కాపాడుకున్న చీరాల కార్మికులను పక్కనపెట్టి బయటి వారికి స్థలాలు ఇవ్వడం అన్యాయమని తెలిపారు. ఈ విషయమై గతేడాది డిసెంబర్ 15న వినతిపత్రం సమర్పించగా దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని చీరాల ఆర్డీఒను కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. అనంతరం డిసెంబర్ 21న ఆర్డీఒ కార్యాలయంలో ఎపిఐఐసి జెడ్‌ఎం, చీరాల తహశీల్దారు, కార్మికులతో సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఆ సమావేశంలో ఆటోనగర్ పక్కనే ఉన్న 10 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసి మూడు నెలల్లో ప్లాట్లు వేయాలని, ఆటోనగర్‌లో మిగిలి ఉన్న 60 ప్లాట్లతో పాటు ఖాళీ అయ్యే ప్లాట్లను కలిపి మొత్తం 250 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక్కో ప్లాట్ కేటాయించాలని నిర్ణయించారని చెప్పారు.
అయితే ఇప్పటివరకు ఆ నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలు లేదా సమావేశ మినిట్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల పేరుతో మభ్యపెట్టి బయటి వారికి స్థలాలు కేటాయించే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం తమకు ఉందని పేర్కొన్నారు. అందువల్ల కలెక్టర్ జోక్యం చేసుకొని ఆర్డీఒ ఇచ్చిన హామీ ప్రకారం వాస్తవ లబ్ధిదారులైన కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని కోరారు. అంతవరకు ఆటోనగర్‌లో నిర్మాణ పనులు నిలిపివేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శంకరరావు, పి కొండయ్య, సమద్ (కార్ మెకానిక్), జిలాని (మెకానిక్), ఇంతియాజ్ (కార్ ఎలక్ట్రిషియన్), బుడే (లారీ మెకానిక్), ముత్తిరెడ్డి రఘురామయ్య (పెయింటర్), బాజీ (ఎలక్ట్రిషియన్), సుబ్రహ్మణ్యం, కరిముల్లా, రఫీ బాబు, పాండురంగారావు, రియాజ్ మెకానిక్, హఫీజ్, సాంబయ్య (బాడీ బిల్డర్) పాల్గొన్నారు.






