– టిడిపిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలో చేరాను
– టిడిపి సభ్యత్వం తీసుకునేలోపు వైసిపికి రాజీనామా చేస్తా
– అవినీతి కారణంగానే అవిశ్వాసం ప్రతిపాదించారు
– అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్దం
– టిడిపి అధిష్టానం నిర్ణయం మేరకు కార్యకర్తగా పనిచేస్తా
– మీడియా సమావేశంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు
చీరాల : మున్సిపాలిటీలో అక్రమాలు, అవినీతి జరిగినందునే అవిశ్వాసం కోరుతున్నట్లు కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చిన అంశంపై మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు స్పందించారు. తన ఛాంబర్‌లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి సంస్థలతో తనపై విచారణకు తానే కోరుతున్నట్లు ప్రకటించారు. తాను ఛైర్మన్ అయిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ది, మున్సిపాలిటీకి మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వివరాలను ప్రకటించారు. వాటితోపాటు గతంలో తాను ఎఎంసి ఛైర్మన్‌గా చేసిన కాలంలో కూడా తనపై విచారణ చేయవచ్చని అన్నారు.
2001లో తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మూడేళ్లపాటు కాంగ్రెస్‌లో డాక్టర్ కొణిజేటి రోశయ్య నాయకత్వంలో పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరి కరణం బలరామకృష్ణమూర్తి ఆశీస్సులతో 2009లో చీరాల తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందినట్లు తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత చీరాల ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య ఒంగోలు పార్లమెంటు అభ్యర్ధిగా పోటీ చేశారని, అప్పటి నుండి తనకు ఎంఎల్‌ఎ కొండయ్యతో స్నేహం ఉన్నట్లు తెలిపారు. 2014లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ చీరాల అభివృద్దికి కలిసి పనిచేద్దామని చెప్పిన ఆహ్వానం మేరకు ఛైర్మన్ చేస్తానన్న హామీతో తాను ఐదో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచినప్పటికీ ఆరుగు కౌన్సలర్లు ఆటో గుర్తుపై గెలిచి 12టిడిపి, 17మంది వైసిపి కౌన్సిరల్లు గెలిచారని గుర్తు చేశారు. అప్పట్లో కృష్ణమోహన్ ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్లే ఛైర్మన్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని, చివరిలో ఒక ఏడాది మాత్రమే ఎఎంసి ఛైర్మన్ చేసినట్లు తెలిపారు.
ఎఎంసి ఛైర్మన్‌గా ఏడాది కాలం పనిచేసిన కాలంలో కూడా తాను నిజాయితీగానే రాజకీయాలు చేశానని చెప్పారు. అలాంటి తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ అవిశ్వాసం కోరడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటించారు. తెలుగుదేశంలో చేరే సమయంలో వైసిపికి రాజీనామా చేశారా? అని ప్రశ్నించగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలో శాసన సభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో టిడిపిలో చేరానని చెప్పారు. అయితే పార్టీ అధ్యక్షులు బిజీగా ఉన్నందున పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, అవిశ్వాసం ప్రకటించిన 14వ తేదీలోపు టిడిపి సభ్యత్వం తీసుకుంటానని, ఆలోపే వైసిపికి రాజీనామా చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, బిజెపి అధ్యక్షులు పురంధరేశ్వరిని కలుస్తానని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని, పార్టీలో ఎప్పటికీ తాను కార్యకర్తగానే పనిచేస్తానని, చీరాల అభివృద్దికి కొండయ్యతో కలిసి పనిచేస్తానని చెప్పారు.






