చీరాల : రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేసి దుకాణాల వద్దనే పాత పద్దతిలో 15రోజులపాడు ఉదయం, సాయంత్రం రేషన్ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంది. అయితే రేషన్ దుకాణాల్లో కార్డులు క్రమబద్దీకరణ పేరుతో ఇంటికి సమీపంలో ఉన్న రేషన్ దుకాణం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ దుకాణానికి కార్డులను అనుసందానం చేసి అక్కడికెళ్లి రేషన్ తీసుకోవాలని చెప్పడంతో అనేక మంది పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంత దూరం నుండి రేషన్ తీసుకుని నడిచి రావడం సాధ్యం కాదని, రిక్షా ఎక్కాలంటే రూపాయి బియ్యానికి రూ.50రిక్షా బాడుగలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీరాల పట్టణంలోని వైకుంఠపురం గాంధీనగర్‌కు చెందిన రేషన్ కార్డు దారులకు హరిప్రసాద్‌నగర్, భవాని పురం కార్డు దారులకు కొత్తపాలెం రేషన్ దుకాణాలకు కార్డులను అనుసంధానం చేయడంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ కార్డులను తమ నివాసాలకు దగ్గరలోని దుకాణాలకు అనుసంధానం చేయాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయంలో గ్రీవెన్స్‌లో విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా వైసిపి యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు కోడూరి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుల క్రమబద్దీకరణ పేరుతో ఇంటికి దగ్గరలో ఉన్న దుకాణంలో ఉన్న కార్డులను దూర ప్రాంతాలకు అనుసంధానం చేయడం ద్వారా రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పేదలకు అనుకూలంగా రేషన్ అందించాలని కోరారు. పేదల రేషన్ పక్కదారి పట్టకుండా పేదలకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ కార్డు దారులు బక్క తిరుపతమ్మ, ఎం శ్రీను, ఎన్ గిరిజ, జి లక్ష్మి, వి ఉషారాణి, జి అనూష, సత్యవతి పాల్గొన్నారు.