ప్రకాశం : టంగుటూరు రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను డిఆర్యుసిసి సభ్యులు బొట్లా రామారావు మంగళవారం పరిశీలించారు. పనులలో నాణ్యతను పెంచాలని కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. టంగుటూరులోని 193లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు అన్ని రకాల అనుమతులు వస్తాయని చెప్పారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ దృష్టికి టంగుటూరు ఆర్ఓబీ నిర్మాణం ప్రాముఖ్యత తీసుకెళ్లామని చెప్పారు. టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. హైదరాబాద్, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్ళు, పినాకిని, నూతనంగా ప్రవేశపెట్టిన గూడూరు – విజయవాడ ఇంటర్ సిటి రైలు ను టంగుటూరులో ఆపుదల చేయమని కోరతామని చెప్పారు.
మాజీ ఎంపీ సుబ్బారెడ్డి ప్రతిపాదించి, అనుమతి పొందిన అగ్రహారం రైల్వే గేటు, సూరారెడ్డిపాలెం రైల్వే గేటు, పాకల రైల్వేగేటులపై ఆర్ఓబీల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిఆర్యుసిసి సమావేశంలో ప్రస్తావిస్తామని అన్నారు. ఆయనవెంట గంగుల శ్రీనివాసరావు, కలికివాయి ఉమ, సుంకర సురేష్ ఉన్నారు.