చీరాల (DN5 News) : ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Dr.V.VinodKumar IAS) తెలిపారు. చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇంటర్మీడియట్ పరీక్షలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆ పరీక్షా కేంద్రంలో ప్రతి గదిని తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ వంటివి జరగడానికి వీలులేదన్నారు. ఆ కళాశాలలో (Inter) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 322 మందిని కేటాయించారు. విద్యార్థుల హాజరుపై ఆయన ఆరా తీశారు. ముగ్గురు గైర్హాజరైనట్లు కళాశాల ప్రధానాచార్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పరీక్ష జరుగుతున్న తీరుతెన్నులు పరిశీలించారు. పోలీసుల బందోబస్తు, భద్రత ఏర్పాట్లు, వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు.






