Home సినిమా రానా తీసుకున్న ఆ నిర్ణయం సరైనదేనా ?

రానా తీసుకున్న ఆ నిర్ణయం సరైనదేనా ?

414
0

దగ్గుబాటి రానా.. 6 అడుగుల ఎత్తు, 6 ఫలకల దేహం, చూడగానే హీరో అన్న మాటకి టెంప్లేట్‌ గా కనిపించే లుక్. అన్నిటికీమించి దగ్గుబాటి రామానాయడు మనవడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, ఈ ‘లీడర్’ హీరో కెరీర్‌లో లీడింగ్ పొజిషన్‌ని చేరుకోలేకపోయాడు. అలా అని కటౌట్ ఉన్న ఈ హీరోలో కంటెంట్ లేదు అనుకుంటే పొరపాటే అవుతోంది. ‘బాహుబలి’తో సమానంగా పోరాడి భళా అనిపించుకున్న స్థాయి రానాది. తొలినాళ్లలోనే బీ టౌన్‌లో కూడా కొన్ని ప్రయత్నాలు చేసి వచ్చాడు. నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న రానా, హీరోగా మాత్రం కమర్షియల్ లెక్కల్లో వెనకపడిపోయాడు. ఆఖరికి ఇప్పుడు చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశప’ నుండి కూడా బయటకి వచ్చేయబోతున్నాడట.

తెలుగులో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో గుణ శేఖర్ ఒకరు. ‘చూడాలనివుంది’, ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ మరియు సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2015లో అనుష్క‌తో చేసిన పీరియాడిక్ మూవీ ‘రుద్రమదేవి’ గుణశేఖర్ చివరి సినిమా. ఆ చిత్రం విడుదలై దాదాపు ఐదేళ్లు కావస్తోంది. అప్పటి నుండి ఇంత వరకు ఆయన మరో చిత్రం మొదలుపెట్టింది లేదు. అయితే కొద్దినెలల క్రితం గుణశేఖర్ దర్శకత్వంలో రానాతో ‘హిరణ్యకశప’ పేరుతో ఓ భారీ చిత్రం చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మొత్తం మూడు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్మాత సురేశ్ బాబు ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చేయాలని రానా నిర్ణయించుకున్నట్టు సమాచారం.

రానా ‘హిరణ్యకశప’ చిత్రం నుండి తప్పుకోవాలి అన్న ఆలోచన వెనుక బలమైన కారణం ఉంది. ఈ మధ్య కాలంలో రానా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. దానితో ఇప్పుడు ఈ హీరో లుక్ పూర్తిగా మారిపోయింది. రానా బాగా సన్నగా అయిపోయాడు. మళ్ళీ ఒకప్పటిలా కనిపించాలి అంటే ఇప్పట్లో కష్టమే. పైగా దాని కోసం శరీరాన్ని బాగా కష్టపెట్టాల్సి వస్తుంది. రానా ఆ రిస్క్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేడు. కాబట్టి ‘హిరణ్యకశప’ పాత్రకి ఇప్పటి తన లుక్ సరిపోదు అన్న కారణంతోనే రానా ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే గుణశేఖర్, నిర్మాత సురేశ్ ఈ విషయం గురించి చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారట. ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నాడు. మరి గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశప’లో హీరోగా నటించే అవకాశం ఇప్పుడు ఏ హీరోకి దక్కుతుందో చూడాలి.