సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘దర్బార్ ‘. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ ‘దుమ్ము ధూళి’.. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలోని మరో పాట, పెళ్లి నేపథ్యంలో వచ్చే ఎనర్జిటిక్ సాంగ్ ‘డుమ్ డుమ్’ను కృష్ణకాంత్ రాశారు. ఈ పాటను తాజాగా విడుదల చేశారు. విడుదలైన కొన్ని క్షణాలలో ఈ పాట వైరల్ అయింది.
ఈ సందర్భంగా గేయ రచయిత కృష్ణకాంత్ (కేకే) మాట్లాడుతూ “సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో పాట రాసే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. ఇది ఒక కలలా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన సూర్య ‘గ్యాంగ్’, నాని ‘జెర్సీ’ సినిమాలలో అన్ని పాటలు రాశాను. అనిరుధ్ నన్ను గుర్తుపెట్టుకుని… ఈ సినిమాలో ఒక పాట రాపించారు. ఈ సినిమాలో ఒక యువ జంటకు పెళ్ళయ్యే సందర్భంలో ఈ ‘డుమ్ డుమ్’ పాట వస్తుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉంటారు? అని చిన్న పిలాసఫీతో సాగే గీతం ఇది. తమిళంలో ఈ పాటను వివేక్ రాసి నాకు పంపించారు. తెలుగులో ఈ పాటను మీరు రాయలని చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను.ఈ ఎనర్జిటిక్ మ్యారేజ్ సాంగ్‌ను నకాష్ అజీజ్ పాడారు. రజనీ ఎనర్జీకి ఆ వాయిస్ బాగా సూట్ అయింది. జనవరి 9న విడుదల అవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తారని ఆశిస్తున్నా” అని అన్నారు.