Home ప్రకాశం కక్ష్య సాధించడమేనా… రాజన్న రాజ్యం : కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి

కక్ష్య సాధించడమేనా… రాజన్న రాజ్యం : కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి

327
0

ప్రకాశం (దమ్ము) : జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్తలపై ముఖ్యమంత్రి రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒక ప్రకటనలో కోరారు. తెలుగుదేశంకు చెందిన పారిశ్రామికవేత్తలు అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ శాసనసభ్యులు పోతుల రామారావులకు చెందిన గ్రానైట్ క్వారీల లీజులను అక్రమంగా రద్దు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని ఆరోపించారు. 102క్వారీలకు నోటీసులు ఇచ్చి కేవలం తెలుగుదేశం నాయకులైన వీరిద్దరికి, వీరిద్దరి క్వారీలకు కోర్టులో స్టే వున్నా లీజులను రద్దు చేయడం దారుణమన్నారు.

ఈ మధ్యకాలంలో తెలుగుదేశం నుండి వైసీపీ కండువా కప్పుకోగానే వారి నోటీసులు పట్టించుకోకుండా వారికి గ్రానైట్ నిస్సిగ్గుగా అమ్ముకోవడానికి పర్మిట్లు ఇచ్చి అంతటితో వారిని వదిలేశారన్నారు. గత 25యేళ్లుగా మచ్చలేకుండా గ్రానైట్ రంగంలో రాణిస్తున్న గొట్టిపాటి, పోతులను తెలుగుదేశంలో కొనసాగుతున్నారని వేధింపులకు గురి చేస్తూ వారి గ్రానైట్ క్వారీ లీజులను అక్రమంగా రద్దు చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలపై రాజకీయ కక్షసాధింపులకు దిగడం పారిశ్రామిక రంగం అభివృద్ధికి మంచిది కాదన్నారు. ఈ విషయంలో టీడీపీ న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. న్యాయస్థానంలో తమకు తప్పక న్యాయం జరుగుతుందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష్య సాధించడమేనా రాజన్న రాజ్యం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇటువంటి కక్ష్యపూరిత రాజకీయాలు మానుకోవడం రాష్ట్ర భవిష్యత్తుకు శ్రేయస్కరమని హితవుపలికారు.