‘ట్రిపుల్ ఆర్’… చాలా కాలం తరువాత తెలుగునాట రూపొందుతున్న సిసలైన మల్టీస్టారర్. యన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఒకే జనరేషన్ స్టార్స్‌తో టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అనౌన్స్‌మెంట్ నాటి నుంచే అటెన్షన్ పొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి… ఏదో ఒక రూపంలో అవాంతరాలు ఎదురవుతూనే ఉండడం వార్తల్లో నిలుస్తోంది. అలా అవాంతరాలు రావడంలో ఓ లొకేషన్ కూడా సెంటిమెంట్‌గా టార్గెట్ అయ్యింది. దాంతో లొకేషన్ ఛేంజ్ అనక తప్పలేదట.
‘ట్రిపుల్ ఆర్’ కథ రీత్యా… పలు చారిత్రక ప్రదేశాలలో చిత్రీకరణ జరపాలని జక్కన్న ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే పూణెలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రారంభమైందో లేదో వెంటవెంటనే రెండు అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. చరణ్ గాయాలపాలు కావడంతో పాటు బ్రిటన్ భామ కూడా సినిమా నుండి తప్పుకుంది. దీంతో యూనిట్ పూణెకి బదులు తమిళనాడులో ఆ షెడ్యూల్ ప్లాన్ చేసిందట.
‘ట్రిపుల్ ఆర్’ కోసం పూణెలో తీయాలనుకున్న సన్నివేశాలన్నీ ఇప్పుడు తమిళనాడులో తెరకెక్కించబోతున్నారట. ఆగస్టు నెల నుంచి ఏకధాటిగా 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని… ఎక్కువ భాగం తారక్ పైనే షూటింగ్ ఉంటుందని సమాచారం. అంతేకాదు ఓ వారం రోజుల పాటు తారక్, చరణ్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయట. ఇక షెడ్యూల్స్ కాస్త అటుఇటు అయినా, అనుకున్న సమయానికే సినిమాని రిలీజ్ చేయడం ఖాయమంటున్నారు. మరి పూణెకి బదులు తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి స్థానభ్రంశం చెందడం ఏ మేరకు కలిసొస్తుందో చూద్దాం…