Home ప్రకాశం 24న వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు అయ్యవారయ్య సంతాప సభ

24న వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు అయ్యవారయ్య సంతాప సభ

687
0

టంగుటూరు(దమ్ము) : వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు రావూరి అయ్యవారయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నెల 24న ఆయన సంతాప సభ జమ్ములపాలెం లోని ఆయన నివాసం వద్ద నిర్వహించనున్నారు.

అయ్యవారయ్య 1963 మే 1న టంగుటూరు మండలం జమ్ములపాలెంలో సామాన్య రైతు కుటుంబంలో కోటయ్య – లక్ష్మమ్మలకు రెండవ సంతానంగా జన్మించారు. అయ్యవారయ్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివి టంగుటూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తిచేశారు. అదే కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. కాలేజీలో చదివే రోజుల్లోనే నాయకత్వ లక్షణాలతో చురుకుగా ఉండేవారు. సుశీలను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు కలిగారు. ఒకరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు చేదోడుగా వ్యాపార రంగంలో వున్నారు.

అయ్యవారయ్య వ్యవసాయం చేస్తూనే మొదట ఆంధ్ర పేపర్ మిల్లుకు కలప సరఫరా ద్వారా వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. 2011లో పూర్తిగా పొగాకు రంగంలోకి అడుగుపెట్టి మారుతీ టుబాకో సప్లైయర్స్, ప్రకాశం ఎంటర్ ఫ్రైజెస్ అనే వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి పొగాకు వ్యాపార రంగంలో ప్రముఖులుగా నిలిచారు. 1995లో కాంగ్రెస్ నుండి ఎంపీటీసీగా గెలుపొంది వైస్ ఎంపీపీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మాజీ శాసనసభ్యులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పోతుల రామారావుకు ముఖ్య అనుచరుడిగా వుంటూ 2001లో వైస్ ఎంపీపీగా 2006లో జడ్పీటీసీ ఉన్నారు. ఆలిండియా టుబాకో బోర్డు మెంబర్ గా, ఇండియన్ టుబాకో అసోషియేషన్ (ఐటిఏ) ట్రెజరరీగా, ఎపిఎస్ ఆర్టిసి మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా, టంగుటూరు సొసైటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. 3 సార్లు బెస్ట్ పొగాకు డీలర్ గా అవార్డు అందుకున్నారు.

అయ్యవారయ్య మృదుస్వభావి. తన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా పనిచేశారు. సహాయం కోసం తన వద్దకు ఎవరొచ్చినా కాదనక రాజకీయాలకు అతీతంగా ఆర్థిక సహాయం అందిస్తుంటారు. అలాగే జమ్ములపాలెం 1116శివలింగాల దేవాలయం ప్రక్కన సాయిబాబా దేవాలయాన్ని నూతనంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉంది. మొదటి నుండి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడిగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి సన్నిహితంగా పార్టీలకతీతంగా వ్యాపార, రాజకీయ రంగంలోని ప్రముఖులతో సత్సంబంధాలు కలిగివున్నారు. టంగుటూరు మండలంలో వైస్సార్ పార్టీకి పెద్దదిక్కుగా కీలకనేతగా పనిచేస్తున్నారు.

ఆయన గత నెలలో గుండె నొప్పికి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన సందర్భంగా తన అనుయాయులు టంగుటూరులో భారీగా ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు. వైస్సార్ సీపీ టంగుటూరు మండల అధ్యక్షులు, తమ సమీప బంధువు సూదనగుంట శ్రీహరిబాబుతో కలిసి హైదరాబాద్ లో వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి తన గ్రామానికి పదిహేను నిమిషాలలో చేరుకునేలోపే ఒంగోలులోని ప్లైఓవర్ బ్రిడ్జి దాటిన తరువాత చెరుకుంపాలెం మార్గం వద్ద జాతీయ రహదారిలో రాత్రి 2.30నిముషాల సమయంలో ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మార్జిన్లో ఆగివున్న లారీ వెనుక బాగాన్ని ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులోని బెలూన్ ఓపెన్ అయినప్పటికీ కారు ఇనుప చువ్వలు బెలూన్ కి గుచ్చుకున్నాయి. ముందు సీట్లో కూర్చున్న అయ్యవారయ్యకు గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.

 

రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు హైదరాబాద్ నుండి హుటాహుటిన వచ్చారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, యువపారిశ్రామిక వేత్త మాగుంట రాఘవరెడ్డి పరామర్శించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, ప్రముఖ పారిశ్రామిక వేత్త బెల్లం కోటయ్య, రాజశేఖర్, ఒంగోలు డిఎస్పీ ప్రసాద్, ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ పోతుల నరసింహారావు, ఎఎంసి వైస్ ఛైర్మన్ చింతపల్లి హరిబాబు, ఎంబీసీ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, వైసీపీ సీనియర్ నాయకులు సూదనగుంట నారాయణ, సిరిపురపు విజయభాస్కరరెడ్డి, గోగినేని వెంకటేశ్వర్లు, డాక్టర్ అశోక్ రెడ్డి, సూరం రమణారెడ్డి, కోటిరెడ్డి కొండపి నియోజకవర్గంలోని వైస్సార్ సీపీకి చెందిన నాయకులు, వైస్సార్ సీపీ నాయకులు వరికూటి అశోక్ బాబు వర్గీయులు, సీపీఎం, సీపీఐ నాయకులు టి రాము, మోజెస్, టి ప్రభాకర్ పరామర్శించారు.