చీరాల : ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యనిధిని పారిశ్రామికవేత్తలకు షేర్ మార్కట్‌లో పెట్టుబడిగా పెట్టేవిధంగా రూపొందించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసేవారికే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు పట్టం కడతారని ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు కొమ్మోజి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి ఫ్యాప్టో చేపట్టిన రాష్ట్ర స్థాయి జీబుజాతా బుధవారం చీరాల చేరుకుంది.
రాష్ట్రస్థాయి సిపిఎస్ వ్యతిరేక జీబు జాతా చీరాల వచ్చిన సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పందిళ్లపల్లి రైల్వే గేటు నుండి చీరాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముంతావారి సెంటర్ నుండి గడియార స్థంభం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం గడియార స్థంభం సెంటర్‌లో మానవ హారం నిర్మించారు. ఈసందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపిఎం విధానం రద్దు చేయాలని డిమాండు చేశారు. జీవిత కాలం ఉద్యోగం చేస్తూ పొదుపు చేసుకున్న సొమ్మకు బద్రత లేకుండా చేసే సిపిఎం విధానం రద్దు చేయకపోతే ఉపాద్యాయుల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. సిపిఎస్ విధానం పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించిన రాజకీయ పార్టీలనే ఉపాధ్యాయులు, ప్రజలు ఆదరిస్తారని చెప్పారు.
కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె వీరాంజనేయులు, సీనియర్ నాయకులు గవిని నాగేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జి సూరిబాబు, జెవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, యుటిఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పాలేరు సురేష్, షేక్ జానీబాషా, బిరుదు పిచ్చయ్య, ఎల్ జయరాజు, ఎస్ చంద్రారెడ్డి, డి నారపరెడ్డి పాల్గొన్నారు.