చీరాల : ఈపురుపాలెం మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు ఆధ్వర్యంలో గ్రామంలోని 250చేనేత కార్మిక కుటుంబాలకు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి చేతులమీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లాక్‌డౌన్ కాలంలో పనులు లేక ఇబ్బంది పడే పేదలు ఎవరు ఆకలితో పస్తులుండే పరిస్థితి ఉండకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో నియోజకవర్గంలోని వైసిపి నాయకులు కార్యకర్తలు పేదలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బియ్యం నిత్యావసరాలతోపాటు రోజువారీ ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల నగదు అందజేసినట్లు తెలిపారు. వీటితోపాటు దాతల సహకారంతో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, ఈపురుపాలెం గ్రామ చేనేత పెద్దలు పాల్గొన్నారు.