– భక్తవత్సలం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
– ఒంగోలు నగరంలోని మాతాశిశు పోషణ ఆలయంలో బాలింతలకు ఆహారం పంపిణీ
– వలస కూలీలు, యాత్రికులకు భోజన వసతి
ఒంగోలు : కరోనా కష్టకాలంలో నిరుపేదలైన దళితులు, గిరిజనులకు అండగా దళితఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ వి భక్తవత్సలం ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలు, దళిత, గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. వంట కూడా చేసుకోవటానికి వీలు లేని నిరుపేదలకు, వలస కూలీలకు, యాచకులకు ఆహారం వండి వడ్డిస్తున్నారు.
జిల్లాలోని పీసీ పల్లి మండలం నేరేడుపల్లిలో 90 గిరిజన కుటుంబాలకు భక్తవత్సలం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒంగోలు పట్టణంలో పాల కేంద్రం వద్ద ఉన్న వలస కూలీలకు, శివాలయం వద్ద ఉన్న యాచకులకు ఆహారం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వాల ప్రోత్సాహంతో పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చెందిన, సేవాభావం ఉన్న దాతలు ముందుకు వస్తే కరోనా కష్టకాలంలో ఉన్న పేదలను ఆదుకో వచ్చని కోరారు. దాతలు మానవత దృక్పథంతో స్పందించాలని కోరారు.
జిల్లాలో ఉపాధి లేక అనేక గ్రామాల నుండి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి మహానగరాలకు భవన నిర్మాణ కార్మికులుగా, ఇతర కూలిపనులకు వేలాదిగా వలసలు వెళ్లారు. కరోనా లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించింది. ఉపాధి లేక పోవడం, పనుల కోసం వలస వెళ్లిన ప్రాంతాల్లో ఆకలి తీర్చుకునే వసతి కూడా లేకపోవడంతో కాలినడకన సొంత గ్రామాలకు చేరుతున్నారు. అలా సొంత గ్రామాలకు చేరిన పేదలకు కూడా ఉపాధి లేక పోవడంతో ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పేదలను, కూలీలను ఆదుకునేందుకు, వాళ్ళ ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
ఒంగోలు నగరంలో గత రెండు, మూడు రోజులుగా మాత-శిశు వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, యాచకులకు, భోజనం, అల్పాహారం పంపిణీ చేశారు. ఎక్కడ చూసినా ఆహార అవసరం అవసరం ఉన్నవారే కనిపిస్తున్నారు. “మే” నెల, 3వ తేదీ వరకు ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటివరకు పేదల ఆకలి తీర్చే కార్యక్రమాలు కొనసాగించవలసిన అవసరం ఉంది. ఇంతవరకు ఏ ఒక్కరిని చేయి చాచకుండా, సొంత నిధులు వెచ్చించి సహకారం అందించామన్నారు. ఒక్కరుగా ఇలాంటి కార్యక్రమం కొనసాగించడం కన్నా ఇతరుల సహకారం కూడా అవసరమని కోరారు.