ఒంగోలు : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలను సురక్షితంగా ఉంచడం, వారి ప్రాణాలు కాపాడటమే చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక ఇస్లాంపేట కంటైన్ మెంట్ జోన్ లో ఉన్న 3500ముస్లిం కుటుంబాలకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో ఎనిమిది రకాల నిత్యావసర సరుకుల ప్యాకెట్లను ఉచితంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ లాక్ డౌన్ లో బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ముస్లిం సోదరులకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసులురెడ్డి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. జిల్లాలో నమోదైన కరోనా వైరస్ కేసులలో సగం కేసులు ఒంగోలు నగరంలోనే ఉండటంతో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కంటైన్ మెంట్ జోన్ అమలు చేస్తున్నామన్నారు.
ఇస్లాంపేట ప్రజలు గృహ నిర్భందంలో ఉన్నారని, దీంతో ప్రజల జీవన స్థితిగతులు స్తంభించాయని అన్నారు. సత్వరమే నిబంధనల్లో సడలింపు ఇస్తే కంటోన్మెంట్ జోన్ తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. కరోనా వైరస్ అరికట్టడంలోనూ, లాక్ డౌన్ అమలులోనూ జిల్లా ప్రజలు అన్ని విధాల సహకరించారని తెలిపారు. జిల్లాలో వైరస్ సోకిన వ్యక్తులు రికవరీ నూరు శాతం ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మెప్మా పిడి కె కృపారావు, ఒంగోలు నియోజక వర్గ ప్రత్యేక అధికారి వసంత బాబు, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డిఎస్పీ ప్రసాద్, ఒంగోలు తహశీల్దార్ చిరంజీవి, మాగుంట చారిటబుల్ సంస్థ ప్రతినిధులు బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.