బాపట్ల (DN5 News) : విజయవాడలో అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో బాపట్ల పాత బస్టాండ్ వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు నిరసన ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు (CITU) జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రేఖఎలిజిబెత్ మాట్లాడారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సోమవారం ఉదయం నుండి 30 గంటల ధర్నా చేస్తున్న వేలాది మంది అంగన్‌వాడీలు నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారు జామున విజయవాడ ధర్నా చౌక్‌లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన అంగన్‌వాడీలను, నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిద్రపోతున్న అంగన్‌వాడీ కార్యకర్తల పట్ల మగ పోలీసులు అమానుషంగా వ్యవహరించారని అన్నారు. పిన్నులతో గుచ్చారని, మహిళలపైన తాళ్ళువేసి, ముసుగు గుడ్డ కప్పి బలవంతంగా వ్యాన్‌లలో కుక్కారని అన్నారు. వారి బ్యాగులు, సెల్‌ఫోన్‌లు తీసుకోనీయలేదని అన్నారు. అంగన్‌వాడీ రాష్ట్ర నాయకులు బి బేబిరాణి, కె సుబ్బరావమ్మతో సహా ఆయా సంఘాలకు చెందిన వెయ్యి మందిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. అరెస్టయిన వారిని 100 కిలోమీటర్ల దూరంలో పల్నాడు, ఏలూరు, నూజివీడు జిల్లాలోని నర్సారావుపేట, సత్తెనపల్లి, చాట్రాయి, బుట్టాయిగూడెం వగైరా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లారని అన్నారు. ఉదయం 5గంటల నుండి 10 గంటల వరకూ కాలకృత్యాలు తీర్చుకోనీయకుండా, వ్యాన్‌ల నుండి దింపకుండా తిప్పారని అన్నారు. మగ పోలీసులు దారుణంగా మహిళల పట్ల వ్యవహరించడం అప్రజాస్వామికమని అన్నారు.
ఇది నూటికి నూరుపాళ్లు మానవహక్కుల ఉల్లంఘనేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీలు ఆందోళన చేసిన సందర్భంగా ఆనాటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ఒప్పందం చేసుకుందని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వ నేతలు అంగన్‌వాడీల ఉద్యమానికి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. జీతాలు పెంచి న్యాయం చేస్తామని వాగ్దానం చేశారని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం మాట తప్పి సమస్యలు పరిష్కరించకపోగా ఇప్పుడు వారిపైనే నిర్బంధానికి దిగడం దారుణమని అన్నారు .
ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా అంగన్‌వాడీ యూనియన్ నాయకులతో వెంటనే చర్చించి న్యాయమైన వేతనాల పెంపుదల, తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, ఐద్వా జిల్లా కార్యదర్శిలు టి కృష్ణమోహన్, పి కొండయ్య, టి సుభాషిని, సిఐటియు నాయకులు తిరుమలరెడ్డి, రవికిరణ్, లక్ష్మణ్, ప్రజా సంఘాల నాయకులు ఎన్ కోటేశ్వరావు, భాస్కరరావు, నాగేశ్వరావు, అంగన్‌వాడి యూనియన్ ప్రాజెక్టు నాయకులు సీతామాలక్ష్మి పాల్గొన్నారు.






