Home బాపట్ల మురుగునీటిని నివారించి సాగు భూములు కాపాడండి : మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు

మురుగునీటిని నివారించి సాగు భూములు కాపాడండి : మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు

55
0
Oplus_16908288

చీరాల : ఈపూరుపాలెం స్ట్రైట్‌కట్‌ అదనపు నీటిపై ఆధారపడి పనిచేస్తున్న అక్కాయపాలెం, గవినివారిపాలెం ఎత్తిపోతల పధకాల పరిధిలోని సాగు భూములను కాపాడాలని మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు అధికారులను కోరారు. ఈ స్ట్రైట్‌కట్‌లో చీరాల పట్టణ మురుగునీరు, ఇతర వ్యర్ధాలు కలవడం వల్ల ఆనీటిని వాడుకున్న ఎత్తిపోతల పధకాల పరిధిలోని సాగు భూములు, గ్రామాల్లో తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. మురుగునీటిని స్ట్రైట్‌కట్‌లో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఒ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్‌ను సోమవారం ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో రైతులతో కలిసి వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మాట్లాడుతూ చీరాల పట్టణంలోని మురుగు నీరు, డయింగ్ నుంచి వచ్చే వ్యర్ధాలు దండుబాట మీదగా విజయనగర కాలనీ వద్ద ఈపురుపాలెం స్ట్రైట్కట్లో కలవడం వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈపురుపాలెం స్ట్రైట్ కట్ మీద అక్కయపాలెం, గవినివారిపాలెం ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో ఒకటి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు మంజూరు చేయగా మరొకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని అన్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల పరిధిలో పదివేల ఎకరాలు రైతులు సాగు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ రెండు ఎత్తిపోతల పథకాల పరిధిలోని పిట్టువారిపాలెం, పచ్చమొగిలి, విజయలక్ష్మిపురం, గవినివారిపాలెం, కొత్త వాడరేవు, బుర్లవారిపాలెం, వాకవారిపాలెం, కొత్తపేట, పాపాయిపాలెం, చెల్లారెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఈ గ్రామాల్లో మురుగునీటి వలన భూ గర్భ నీళ్లు, తాగు నీరు కలుషితం అవుతున్నాయని అన్నారు. ఆ నీరు పశువులు తాగుటానికి కూడా ఉపయోగపడటం లేదని తెలిపారు. అలాంటి ఆ కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. కాబట్టి చీరాల మున్సిపాలిటీ పరిధిలోని మురుగు నీరు, వ్యర్థాలు ఆ స్ట్రైట్‌ కట్లో కలవనీయకుండా చూడాలని అధికారులను కోరారు. లేదంటే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.