అధికార, ప్రతిపక్ష పార్టీల విధానాలనూ, చేతలను ప్రజలకు వివరిస్తూ ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో విలేకర్ల పాత్ర కీలకమైనది. మీడియా సంస్థలు నిష్పక్ష పాతంగా ఉన్నంత కాలం అన్ని పార్టీల కథనాలను ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యతలు ఇచ్చి వార్తాకథనాలు ప్రచురించినంత కాలం విలేకరి వృత్తి గౌరవ ప్రదంగానే ఉంది. ముఖ్యమంత్రులు సైతం విలేకర్లు వచ్చే వరకు కార్యక్రమాలు ప్రారంభించకుండా వేచి చూసిన రోజులు గతం. కానీ నేడు విలేకర్ల పరిస్థితి, మీడియా సంస్థల ధోరణి పూర్తిగా మారిపోయింది.
రాజకీయ నాయకులు, కార్పొరేట్ వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలను సైతం నియంత్రించే శక్తిమంతులు ఇప్పుడు మీడియా సంస్థలకు అధిపతులు అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయా మీడియా సంస్థల్లో పనిచేసే వాళ్లలో నిత్యం జనంతో కలిసి తిరుగుతూ విధులు నిర్వహించే విలేకరుల పరిస్థితి ”అడకత్తెరలో పోకచక్క” చందంగా మారింది. ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థలుగా మారాయి. అందుకు తగినట్లుగానే ఆయా పత్రికలు, టివీల్లో కథనాలు, వార్తలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఇదే క్రమంలో అన్నీ రాజకీయ పార్టీలు వారికి అనుబంధ సోషల్ మీడియా బృంధాలను ఏర్పాటు చేసుకున్నాయి. వాళ్లకు అవసరమైన ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కార్పొరేట్ సంస్థల యజమానులు రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం మీడియా సంస్థలకూ జయమానులుగా అవతారమెత్తి విలేకరి వృత్తినే కలుషితం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యాపార సంస్థల పరిస్థితి బాగుంటే ప్రతికూల సంస్థలు ప్రభుత్వంపై ప్రతికూల దాడులు చేస్తున్నాయి. ఈ దాడిని తట్టుకోలేని అధికారపార్టీ నేతలు విలేకర్లను నియంత్రించాలనుకోవడం అవివేకం. తెలంగాణ, ఆంద్ర రెండు ప్రాంతాల్లో అధినేతలు నేరుగా మీడియా సమావేశాల్లో మీరే విలేకరి? మీరు అలాగే అడుగుతారులే? అంటూ విలేకరులపై చేస్తున్న వ్యాఖ్యలు మండల స్థాయి విలేకరులపై మండల స్థాయి నేతలనుసైతం ప్రభావితం చేస్తున్నాయి.
మీడియా, పత్రికల్లో పనిచేస్తున్న విలేకరులను సైతం నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పంచుకున్నారు. ఒక నేత మీటింగుకు ఒకవర్గం మీడియా ప్రతినిధులు, ప్రతికల విలేకరులకు ప్రవేశం ఉండదు. ఒకవేళ విలేకరిగా తెలుసుకుని వెళ్లడం బాధ్యతగా భావించి వెళ్లినా ఆ విలేకరి తమవాడు కాదని, ఎవరికో సమాచారం అందించడానికి వచ్చాడన్నట్లు అనుమానంగా చూసి అవమానించడం వంటి సందర్భాలు ఇప్పుడు సాధారణమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో రెండో వర్గం నేతలు వారికి అనుకూలమైన మీడియా విలేకర్లకే పరిమితమవుతున్నారు. ఒకప్పటిలాగా అధికార, ప్రతిపక్ష నేతలు ఇద్దరి వద్దకు వెళ్లగలిగే విలేకర్లను వేళ్లమీద లెక్కించడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది.
ఇదే క్రమంలో ఆయా మీడియా సంస్థల వ్యాపార ప్రకటనల సేకరణ, టార్గెట్ కూడా ఇక్కడ ప్రధానమైనది. రెండు వర్గాల రాజకీయ ప్రతినిధుల వద్దకు ఏ విలేకరైనా వెళితే అతను పనిచేసే సంస్థకు ఇద్దరూ ప్రకటనలు ఇచ్చే పరిస్థితి లేదు. రాజకీయ ప్రకటనలే కాదు పట్టణంలోని వ్యాపార సంస్థల ప్రతినిధుల ప్రకటనలూ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ విలేకరి ఏ నేతకు అనుకూలమైన వ్యక్తో, ఏ నేతకు నచ్చని వ్యక్తో, అతనికి వ్యాపార ప్రకటన ఇస్తే ఏ నేత నుండి కక్షసాధింపు ఎదర్కొవాల్సి వస్తుందోనన్న భయం పట్టణ స్థాయిలో వ్యాపార సంస్థల నిర్వాహకులకూ తప్పడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్పోరేట్ సంస్థల అధిపతులే మీడియా సంస్థలకు యజమానులైన తర్వాత క్రిందిస్థాయిలో విలేకరులకు ఇచ్చే వ్యాపార టార్గెట్ (యాడ్స్) పూర్తి చేసేందుకు విలేకరులు అనుభవిస్తున్న మానసిక, భౌతిక వత్తిడి వర్ణణాతీతం.
ఇన్ని వత్తిడులను అధిగమించి టార్గెట్ ప్రకారం వ్యాపార ప్రకటనలు సేకరిస్తే ఏమైనా ఉద్యోగ బద్రత ఉంటుందా? అంటే అదీ ఉండదు. అంతకన్నా ఎక్కువ వ్యాపారం ఇస్తామన్నా, టార్గెట్‌తో పనిలేకుండా నెలకు నిర్ధిష్టంగా ఇంత ఇస్తామని ఎవ్వరైనా ముందుకొస్తే తెల్లవారేసరికి పాత విలేకరి స్థానంలో కొత్తవాళ్లు వస్తారు. వీటన్నింటికన్నా ఎంత వసూలు చేస్తున్నారోననే అపవాదు అంటకడతారు. యాజమాన్యాలు ఎవ్వరూ విలేకరులకు వేతనం చెల్లించరు. రెండు, మూడు పత్రికలు మాత్రమే ఎంతోకొంత విలేకరులకు ఇస్తారు. మిగిలిన అన్నీ సంస్థలు విలేకరులనే ఎదురు కట్టమనే పరిస్థితి. ‘ఎలా బ్రతకాలో మీకు తెలుసు కదా! మీరు బ్రతుకుతూ సంస్థను బ్రతికించండి.’ అంటూ సెలవిచ్చే సంస్థలు ఏమిటో మీడియా రంగంలో ఉన్న అందరికీ తెలిసిందే. పేరు గొప్పగా చెప్పుకునే మీడియా సంస్థలు నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న విలేకరులు, కెమేరా మెన్‌లకు ఏమిస్తున్నారో? వాళ్లెలా జీవనం నెట్టుకొస్తున్నారో? వాళ్లపై ఎన్ని అపవాదులు మూటకడుతున్నారో? అనుభవించే విలేకరికి మాత్రమే తెలుసు. వీరిమానసిక వేధన మాటల్లో వర్ణించడం వల్లకాదు.
ఇంత కష్టమైనా వీధిలో వెళుతుంటే నమస్తే అన్నా అంటూ ఎవరైనా పలకరిస్తే అన్నీ మర్చిపోయి పెదాలపై చిరునవ్వు ఒక్కసారి తొణికిసలాడుతుంది. తననేదైనా రాజకీయ విళ్లేషణో, ఇంకేదైనా సమాచరమో అడిగితే తానే ప్రపంచ జ్ఞానిగా విశ్లేషిస్తాడు. అక్కడితో అయిపోతుంది. మళ్లీ యధాతంతు. ఎవరిపైనైనా ప్రతికూల వార్త ప్రచురితమైతే ఏం జరుగుతుందో ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు చూశాం. నేతల రాజకీయ ప్రయోజనాలకు, మీడియా సంస్థల వ్యాపార టార్గెట్ కోసం మద్యలో నలుగుతొంది మాత్రం సామాన్య విలేకరి మిత్రులే. ప్రత్యర్ధిపార్టీని, వాటి అనుకూల మీడియా సంస్థల యాజమాన్యాలను ఎదుర్కొనడం పక్కనపెట్టి విలేకర్లను నియంత్రించాలని చట్టం చేయడంలో చూపిన ఉత్సాహం, అష్టకష్టాల్లో విలేకరి వృత్తి కొనసాగిస్తున్న వారి సంక్షేమం కోసం వీసమంతైనా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కేరళ, పశ్చిమబెంగాళ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మీడియాలో పనిచేసిన వారికి సంక్షేమ సౌకర్యం ఉంది. మన రాష్ట్రంలో బస్సు ప్రయాణం తప్ప మరే సౌకర్యం లేదు. దానికి కూడా ఇప్పుడు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. విలేకర్లపై తీసుకొచ్చే కొత్త నిబంధనలు ఏ ప్రయోజనం కోసమో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులే ఆలోచించాలి.