Home ప్రకాశం కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఎస్పి దాతృత్వం

కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఎస్పి దాతృత్వం

270
0

ప్రకాశం జిల్లా : ఒంగోలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కె అంకయ్య సతీమణి ఈ నెల 3వ తేదీన స్థానిక సంఘమిత్ర ఆసుపత్రిలో ఒకే కాన్పులో నెలలు నిండని ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే ముగ్గురు శిశువులను మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని రేయిన్బో హాస్పిటల్ లో చేర్చగా, ఆ శిశువులకు అత్యంత ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు తెలపడంతో కానిస్టేబుల్ అంకయ్య తీవ్రమైన బాధతో తోటి పోలీసులకు చెప్పుకున్నారు. ఆ విషయం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ దృష్టికి వెల్లింది. వెంటనే అంకయ్యను తనవద్దకు పిలిపించుకుని విషయం అడిగి తెలుసుకున్నారు. తోటి అధికారులకు విషయం తెలిపి కానిస్టేబుల్ అంకయ్యకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా జిల్లా అధికారులతో పాటు ఇతర జిల్లాల పోలీస్ అధికారులు కూడా స్పందించి రూ.10లక్షల విరాళాలను జిల్లా ఎస్పీకి అందజేశారు.

విరాళాల రూపంలో వచ్చిన రూ.10లక్షల చెక్కును ఎస్పీ సిద్దార్థ కౌశల్ కానిస్టేబుల్ అంకయ్యను తన చాంబర్ కి పిలిపించుకుని అందజేసి తన బిడ్డలకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే అండగా ఉంటానని ఎస్పీ తెలిపారు. తన బిడ్డల చికిత్సకు అందించిన చెక్కును అందుకున్న అంకయ్య సంతోషంతో జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. తోటి పోలీస్ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే స్పందించి పోలీస్ అధికారుల ద్వారా విరాళాలు సేకరించి రూ.10లక్షల చెక్కును అందించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ఔదార్యాన్ని జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు, పోలీసు సిబ్బంది కొనియాడారు.