– స్టేషనులో రికార్డులు పరిశీలన… నమోదైన కేసులపై ఆరా – రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి – దొంగతనాల కేసుల్లో ప్రాపర్టీ రికవరీ శాతం ఇంకా పెంచాలి – మహిళా పోలీసులు గ్రామాల్లోని నేర, శాంతి భద్రతలు, అసాంఘీక కార్యకలాపాలపై సమాచారమును ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియపర్చాలి.
టంగుటూరు (దమ్ము) : వార్షిక తనిఖీల్లో భాగంగా సింగరాయకొండ సర్కిల్ లోని టంగుటూరు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ మల్లికా గర్గ్ తనిఖీ చేసారు. ముందుగా స్టేషన్ ఆవరణాన్ని, పోలీస్ క్వార్టర్స్ మరియు పోలీసు స్టేషన్ లోని వివిధ రూములను, రిసెప్షన్ రూమ్ లను పరిశీలించారు. టంగుటూరు పోలీసు స్టేషన్లలో నమోదుకాబడిన మర్డర్, దొంగతనాలు, క్రైమ్ ఎగైనెస్ట్ వుమన్, ఎక్సైజ్, ఐటీ కేసులు, రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర కేసులకు సంబంధించిన సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రయల్ కేసుల ఫైళ్లను, పలు రిజిస్టర్ లను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వస్తువులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు తీరుతెన్నులు, పురోగతి, మొదలగు అంశాలను గూర్చి ఆరా తీసి సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం చేసారు. స్టేషన్లో నిర్వహించే రికార్డ్స్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
స్టేషన్ పరిధిలో నేర, శాంతి భద్రతల పరిస్థితిలు మరియు అసాంఘిక కార్యకలాపాల గురించి, ఎక్కువగా జరిగే నేరాలపై అధికారులను ఆరా తీశారు. దొంగతనాల, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు కట్టడి, అక్రమ ఇసుక, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారని, బీట్స్ బాగా పెంచి స్టేషన్ పరిధిలో జరిగే క్రైమ్ జరగకుండా చూడాలని, దొంగతనాల కేసుల్లో ప్రాపర్టీ రికవరీ శాతం పెంచాలని, పాత నేరస్ధులు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేయాలని, UI కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యాలని ఆదేశించారు.
అనంతరం ఎస్పీ మల్లికా గర్గ్ సచివాలయ మహిళా పోలీసులతో సమావేశమై గ్రామాల్లో అనుమానిత/కొత్త వ్యక్తుల వివరాలు సేకరించాలని, ప్రైవేట్ సీసీ టీవీ కెమెరాల పనితీరు క్రమంగా పరిశీలించాలని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, పోలీస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు లేని ఆటోలను గుర్తించాలని, ప్రజలకు సైబర్ మోసాలు /జాబ్ మోసాలపై, దిశా యాప్ పై అవగాహన కల్పించాలని, నేర, శాంతి భద్రతలు, అసాంఘీక కార్యకలాపాలు మరియు ఇతర అంశాలపై సమాచారమును ఎప్పటికప్పుడు పైఅధికారులకు తెలియపర్చాలని సూచించారు. మహిళా పోలీసుల పనితీరు మరింత మెరుగుపరుచుటకు దోహదపడే మార్గదర్శకాలు జారీ చేసారు.
పోలీసు స్టేషన్లలోని సిబ్బందితో మాట్లాడి వారి పని తీరు, వారు ఏ ఏ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు, అక్కడ ఉన్న పరిస్థితులు, సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విధినిర్వహణ సమర్థవంతంగా చేయాలని, వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
వేసవిలో దాహార్తి తీర్చుటకు చలివేంద్రాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్
బాటసారులు, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో టంగుటూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. దాహార్తులకు మజ్జిగ, చల్లని నీరు అందించారు. వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పోలీస్ శాఖ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రజలకు వివిధ రూపాల్లో సేవ చేయడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఆమె వెంట ట్రైనీ ఐపీఎస్ అంకిత సురాన, ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు, DSB DSP బి.మరియదాసు, సింగరాయకొండ సిఐ రంగనాధ్, ఐటీ కోర్ ఎస్సై కె.అజయ్ కుమార్, టంగుటూరు ఎస్సై ఖాధర్ బాషా, జరుగుమల్లి ఎస్సై వెంకటేశ్వరరావు, S.కొండ ఎస్సై ఫాతిమా, ఎస్పీ సిసి నారాయణ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.