Home ప్రకాశం ఇంటి పన్నుల గోల్ మాల్ పై సమగ్ర విచారణ జరపాలి : దేశాయిపేట గ్రామస్తుల ఆందోళన

ఇంటి పన్నుల గోల్ మాల్ పై సమగ్ర విచారణ జరపాలి : దేశాయిపేట గ్రామస్తుల ఆందోళన

384
0

ప్రకాశం : వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీలో 2016 నుండి 2019 వరకు వసూళ్లు చేసిన ఇంటి పన్ను నిధులు గోల్ మాల్ పై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని దేశాయిపేట గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి, పూర్వపు పంచాయతీ కార్యదర్శి కాలంలో సుమారు రూ.40లక్షలకుపైగా ఇంటి పన్ను నిధులు గోల్ మాల్ జరగడంపై దేశాయిపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ఇంటి పన్ను చెల్లించాలంటూ గ్రామస్తులకు డిమాండ్ నోటీసులు ఇవ్వడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 11గంటలకు గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంకు సమస్యపై వెళ్లగా పంచాయతీ అధికారులు, సిబ్బంది ఎవరు అందుబాటులో లేరని గ్రామానికి చెందిన బీరక పరమేష్ తెలిపారు. గ్రామస్తులు అందరూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగి మండల అభివృద్ధి అధికారికి సమాచారం ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి వచ్చారని కర్ణ కృష్ణమోహన్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శంకర్రావు గ్రామస్తులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో గ్రామస్తులందరూ మండల అభివృద్ధి కార్యాలయంకు వెళ్లి పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న నిధుల గోల్మాల్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇంటి పన్నులు చెల్లిస్తున్నవారికి కూడా మూడు సంవత్సరాల పన్నులు చెల్లించాలని పంచాయతీ అధికారులు నోటీసు ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులలో లాక్ డౌన్ కారణంగా చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులు మళ్లీ పన్ను చెల్లించాలంటూ పంచాయతీ అధికారులు డిమాండ్ నోటీసు ఇవ్వడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపిడిఓని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో ప్రజా సంఘాల నాయకులు వావిలాల దాశరధి, కోటి ఆనంద్, ఊటుకూరు వెంకటేశ్వర్లు, అచ్యుతుని బాబురావు, శామ్యూల్, బాధితులు పింజల సాంబశివరావు, నాసిక కోటినాగేశ్వరరావు, బండారు నాగరాజు, కర్ణ కాళహస్తి, పింజల బాలకృష్ణ వున్నారు.