రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ఎస్‌సి, ఎస్‌టిలకు ఇచ్చిన ట్రాక్టర్ సబ్సిడీ సమస్య పరిష్కారానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పచ్చజెండా ఊపారు. 2015-20పారిశ్రామిక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు సర్వీస్ సెక్టార్‌లో భాగంగా ట్రాన్స్‌పోర్టు వాహనాల కొనుగోలుపై రాయితీలను ప్రకటించింది. నిబంధనల ప్రకారం మహిళలకు 45శాతం, జనరల్‌కు 35శాతం రాయితీ వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన వాళ్లు రాష్ట్రంలో 1200మంది వాహనాలు కొనుగోలు చేశారు. జిల్లాలో డీలర్లను, బ్యాంకర్లను సమన్వయ పరిచి ఎక్కువ సంఖ్యలో వాహనాలు కొనుగోలుకు ప్రయత్నించడం జరిగింది. ఇక్కడ కూడా అనేక నిబంధనలు, ప్రతిబంధకాలలో గత రెండు సంవత్సరాలుగా వీరి ఆన్‌లైన్ దరఖాస్తులను పరిశీలించకుండా అధికారుల నిలిపేశారు. పైస్థాయి అధికారులు, కింది స్థాయి అధికారులకు సమన్వయం లేని కారణంగానూ సమస్య అర్ధం చేసుకోలేకపోగా మరిన్ని నిబంధనలతో మానసికంగా వేధించారు. ఇన్సూరెన్స్ విషయంలో జరిగిన పొరపాట్లను సాకుగా చూపి దానిని సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టకుండా తాత్సారం చేశారు. ట్రాక్టర్ యజమానులు కిస్తీలు చెల్లించలేక, కరువు పరిస్థితులను ఎదురీదుతూ బ్యాంకుల్లో అప్పులు పెరిగిపోయి ఇంటి ముందు ట్రాక్టర్‌ను బ్యాంకర్లు ఎత్తుకుపోతున్నా బాధను మౌనంగా భరించారు. ఈ అంశంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రతినిధి వి భక్తవత్సలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్సందించిన పరిశ్రమల శాఖ కమీషనర్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ డైరెక్టర్ విజయరత్నం, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి గోపాల్ పరిష్కారం దిశగా కృషి చేశారు. ట్రాక్టర్ల రాయితీలు చెల్లించాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సానుకూలంగా స్పందించిన అధికారులు, మంత్రులకు ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామిక ప్రతినిధి బృంధం కృతజ్ఞతలు తెలిపారు.