చీరాల : ప్రజాసమస్యల పరిష్కారం ద్వారానే సుపరిపాలన సాధ్యమని కలెక్టర్ వి వినయ్‌చంద్ పేర్కొన్నారు. ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారానికి వినూతన కార్యక్రమం చేపట్టారన్నారు. ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలోని ఓపెన్ ధియేటర్‌లో శనివారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులు అందరూ సక్రమంగా విధులు నిర్వహిస్తే ప్రజలకు ఉన్నతాధికారులను కలవాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ప్రజలనుండి వచ్చే వినతులను తక్షణం పరిష్కరించేందుకు అధికారులందరినీ ఒకే వేదికపైకి చేర్చే ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వచ్చి విన్నవించుకుంటున్నారని చెప్పారు. ప్రజావేదిక ద్వారా తమ శాఖల పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజాసమస్యలను తమ సమస్యలుగా అధికారులు భావించి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాసమస్యల పరిష్కారానికి 1100టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా 24గంటలు అందుబాటులో ఉండే వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. గత జన్మభూమి కార్యక్రమంలో చీరాల నియోజకవర్గం నుండి ఎక్కువమంది నివేశన స్థలం కోసం ధరకాస్తు చేసుకున్నారని చెప్పారు. భూమి కొనుగోలు చేసి ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రజల బహుముఖ ప్రయోజనం కోసమే ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో 73శాఖల్లో 3196మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. సమాజంలో అందరూ భాగస్వామ్యంగా ఉండి ప్రజలకు మంచి పాలన అందించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కిందిస్తాయి ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని కోరారు. చీరాల పట్టణంలో ఐదు వేలు, వేటపాలెం మండలంలో మూడు వేలమంది ఇళ్ల స్థలం కోసం ధరకాస్తు చేసుకున్నారని చెప్పారు. జిప్లస్1 పద్దతిలో పట్టణంలో 15ఎకరాల్లో ఇళ్లు నిర్మాణం చేయాలని ఉందన్నారు. దేవాంగపురిలో రెండున్న ఎకరాలు, దేశాయిపేటలో ఐదు ఎకరాలు గృహనిర్మాణాల కోసం గుర్తించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్‌డిఒ కె శ్రీనివాసరావు, మున్సిపల్ ఛైర్మన్ మోదడుగు రమేష్‌బాబు, వేటపాలెం ఎంపిపి బండ్ల తిరుమలాదేవి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డిఆర్‌డిఎ పిడి ఎంఎస్ మురళి, మున్సిపల్ కమీషనర్ ఎం శ్రీనివాసరావు, డిఇ గణపతి, టిపిఒ ఎస్ శ్రీనివాసరావు, చీరాల, వేటపాలెం తహశీల్దార్లు ఎం వెంకటేశ్వర్లు, కెఎల్ మహేశ్వరరావు పాల్గొన్నారు.