గుంటూరు : పోలీసులు సంఘం పెట్టారు. వారి సంఘానికి నాయకత్వాన్ని ఎంపిక చేసుకొనున్నారు. డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 7 నుంచి 27 వరకు సర్కిల్ నుంచి జిల్లాస్థాయి వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రధానంగా జిల్లా పోలీసు అధికారుల సంఘ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సర్కిల్, సబ్ డివిజన్, జిల్లా స్థాయిల్లో ఎన్నికైన సభ్యులు కలిసి జిల్లా అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సభ్యులుగా ఎన్నికైన వారికి మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది.
నూతన అధ్యక్షుడు, కార్యవర్గం ఎన్నికకు ఈ నెల 18న నామినేషన్లు స్వీకరిస్తారు. 19న పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. 27న ఎన్నిక నిర్వహిస్తారు.
సర్కిల్ స్థాయిలో సభ్యుల ఎంపికకు ఈ నెల 7న ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్న మూడు నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 8న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. పోటీ అనివార్యమైతే 10న ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సర్కిల్ పరిధిలో సివిల్ కానిస్టేబుళ్లు, సివిల్ హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. వంద మందిలోపు సిబ్బంది ఉన్న చోట ఒకరు, అంతకుమించితే ఇద్దరు సభ్యులుగా ఎన్నికవుతారు.
సబ్ డివిజన్ స్థాయిలో ఈ నెల 9న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తారు. 10న నామినేషన్ల ఉపసంహరణ, పోటీ అనివార్యమైతే 12న ఎన్నికలు జరుగుతాయి. ఇందులో సివిల్ ఏఎస్సైలు, ఎస్సైలు ఓటు వేయాలి. సబ్ డివిజన్‌లో ఒక్కో సర్కిల్ నుంచి ఇద్దరేసి సభ్యులను ఎంపిక చేస్తారు.
జిల్లా స్థాయిలో సివిల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లు, ఏఆర్ హెచ్‌సీ, ఏఆర్‌ఎస్సై, ఆర్‌ఎస్సై, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, సివిల్ మహిళా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ స్థాయిలో 13న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, 14న ఉపసంహరణ ఉంటుంది. పోటీ అనివార్యమైతే 16న ఎన్నికలు నిర్వహించారు. అధికారుల ర్యాంకు చొప్పున ఒక్కో సభ్యుడితో పాటు 49 మంది సభ్యులు ఉండే ప్లటూన్‌కు ఒకరి చొప్పున ఇక్కడ సభ్యులను ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి బరిలోకి దిగాలంటే తొలుత సర్కిల్ స్థాయిలో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. దీనికి పూర్తిగా తమ సర్కిల్‌లోని సిబ్బంది సహకారం అవసరం. ఏఎస్సై, ఎస్సై, సీఐ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులకు సైతం ఓటు హక్కు, ఎన్నికల బరిలో నిలిచే హక్కు ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయిలోనే ఉంటుంది. సంఘంలో కీలక బాధ్యతలన్నీ ఈ స్థాయి వారికే అప్పగించటం ఆనవాయితీ. అధికారులు కొన్ని బాధ్యతలు తీసుకున్నా వారి భాగస్వామ్యం నామమాత్రంగానే ఉంటుంది.