టంగుటూరు (దమ్ము) : పోలీసులు కూడా మనలాంటి ప్రజలేనని వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీసులకు యూనిఫామ్, హెల్మెట్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ చిన్నతనంలో పోలీసులను చూసి భయపడేవారిమని కానీ నేడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. పోలీసులంటే శత్రువుల్లాగా చూడకుండా సహకారం అందించాలన్నారు. పోలీసు విధి ప్రజలను కాపాడడం కాబట్టి వారికి మనం సమాచారం అందివ్వాలన్నారు. పోలీస్ అమరవీరులు నక్సలైట్ల వల్ల, యాంటీ నక్షలైట్ల స్క్వాడ్ లలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. అలాగే కరోనా పోరాటంలో కూడా పోలీసులు, డాక్టర్లు, మీడియా, ఇతర సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందన్నారు. పోలీసులు కూడా మనలో నుండి వచ్చిన వారేనన్నారు. పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటూ న్యాయపరంగా నడుచుకోవాలని సూచించారు.
వైసీపీ నాయకులు సిరిపురపు విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు పాత కాలంలో కట్టిన టంగుటూరు పోలీస్ స్టేషన్ గ్రామంలోనే ఉండిపోయిందని, భవనం కూడా శిథిలావస్థకు చేరి వసతులు లేకుండా ఉందన్నారు. గతంలో హైవేలో వుండిందని, మండలమంతా హైవేకి అవతల ఉంది కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ ను అప్ గ్రెడేషన్ స్టేషన్ గా మార్చి నేషనల్ హైవేలో కొత్త పోలీస్ స్టేషన్ గా నూతన భవనాన్ని నిర్మించాలని తన అభిప్రాయమన్నారు. ఎస్ఐతో కూడా ఈ విషయం మాట్లాడానని, స్థలాన్ని కూడా గుర్తించడం జరిగిందన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలంటే నేషనల్ హైవేలో పోలీస్ స్టేషన్ ఉండాలన్నారు. పోలీసుల గృహాలు మాత్రం ఇక్కడే ఉంటాయన్నారు. వెంకయ్య ఆధ్వర్యంలో నేషనల్ హైవేలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం జరగాలన్నారు.
ఈ సందర్భంగా సింగరాయకొండ సిఐ యు శ్రీనివాసులు దాతలు విజయభాస్కరరెడ్డి, నారాయణ రావులను అభినందించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నలభైమంది పోలీసు సిబ్బందికి వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, వైసీపీ నాయకులు, ప్రముఖ కాంట్రాక్టర్ సిరిపురపు విజయభాస్కరరెడ్డి, ఏఎంసి వైఎస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, వైసీపీ సీనియర్ నాయకులు సూదనగుంట నారాయణ చేతుల మీదుగా పోలీస్ యూనిఫామ్, హెల్మెట్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై మాతంగి శ్రీనివాసరావు, ఎంబిసి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.