Home ప్రకాశం టంగుటూరులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

టంగుటూరులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

506
0

టంగుటూరు (దమ్ము) : రాష్ట్రంలోని పలుప్రాంతాలలో దేవాలయాల విధ్వంసం, దొంగతనాలు, సంఘవిద్రోహ చర్యల నియంత్రణలో భాగంగా వెస్ట్ పోతులకాలనీపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరాయకొండ సిఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్సై శ్రీనివాసరావుతో పాటు 10మంది ఎస్సైలు, 50మంది స్పెషల్ పార్టీ పోలీసులు 100మంది సాధారణ పోలీసులు తెల్లవారు జామున నాలుగు గంటల నుండి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వెస్ట్ పోతులకాలనీలో బజారుకు సుమారు పదిమంది పోలీసుల చొప్పున అందరూ ఒక్కసారి ప్రతి ఇంటికి వెళ్లి, నిద్రపోతున్నవారిని సైతం నిద్రలేపి, ఆధార్ కార్డు చూసి, పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని, ఇంట్లోని మంచంకింద, మరుగుదొడ్లలో సోదాలు నిర్వహించారు. అకస్మాత్తుగా పోలీసులు వచ్చి నిద్రలేపడంతో కాలనీ వాసులు ఒకింత భయానికి లోనయ్యారు.

టంగుటూరులో ఇంతకు ముందెప్పుడూ ఇంతమంది పోలీసులు ఒకేసారి ఇల్లిల్లు సోదాలు నిర్వహించడం చూడలేదని కాలనీవాసులు చెప్పుకుంటున్నారు. తనిఖీల అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఒంగోలు డిఎస్పీ ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈమధ్య జరిగిన అసాంఘిక కార్యకలాపాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సూచన మేరకు ఉదయం 4గంటల నుండి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో భాగంగా సరైన పత్రాలు లేని 25మోటారు వాహనాలు, ఒక ఆటో, పది మారణాయుధాలు, ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఆపరేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, అనుమానితులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.