బాపట్ల (DN5 News): ప్రధానమంత్రి సూర్య ఘర్ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Dr.V.VinodKumar IAS)తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ (PM SuryGhar) ఆదర్శ గ్రామం పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పిఎం సూర్య ఘర్ ఆదర్శ గ్రామాల పథకాన్ని ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేయాలన్నారు.
జిల్లాలో ఆరు గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆ గ్రామాలలో నూరు శాతం సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పొందితే ఆదర్శ గ్రామంగా ప్రకటించాలని అన్నారు. రేపల్లె నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం పిట్టలవానిపాలెం గ్రామంలో 12,036 గృహాలకు సూర్యఘర్ వర్తింపచేయాలని అన్నారు. చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో 16,931 గృహాలకు సూర్యఘర్ వర్తింపచేయాలని అన్నారు. పర్చూరు నియోజకవర్గంలో కారంచేడు గ్రామంలో 11,667 గృహాలు, బాపట్ల నియోజకవర్గంలో చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో 7,192 గృహాలు, వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో 8,300 గృహాలకు సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.
తద్వారా ఆ గ్రామానికి కేంద్రం నుంచి రూ.ఒక కోటి నిధులు వస్తాయన్నారు. సంపూర్ణంగా ఆదర్శ గ్రామాలను చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలోనూ 8,279 గృహాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని వర్తింప చేయాలన్నారు. సమావేశంలో సిపిడిసిఎల్ ఎస్ఈ ఆంజనేయులు, ప్రకాశం డిప్యూటీ సీఈఒ బాలమ్మ, గుంటూరు డిప్యూటీ సీఈఒ కృష్ణ, ఎల్‌డిఎం శివకృష్ణ, విద్యుత్ శాఖ డీఈలు పాల్గొన్నారు.






