Home జాతీయం మెరీనా బీచ్‌లోనే కరుణానిధి అంత్యక్రియలు : హాజ‌రైన ప్ర‌ధాని మోడీ

మెరీనా బీచ్‌లోనే కరుణానిధి అంత్యక్రియలు : హాజ‌రైన ప్ర‌ధాని మోడీ

529
0

– స్థలం కేటాయింపుపై మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు
– భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు, డీఎంకే శ్రేణులు
– ప్ర‌ధాని మోడీ, ఎపి సిఎం చంద్ర‌బాబు, ప‌శ్చిమ‌బెంగాల్ సిఎం మ‌మ‌తాబెనర్జీ నివాళులు

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, క‌లైంజ‌ర్ (ద‌క్షిణామూర్తి) కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకి తొలగింది. అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించాలని ప్ర‌భుత్వానికి సూచిస్తూ మద్రాస్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. అందుకు అవ‌స‌ర‌మైన‌ స్థలం కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దివంగత డీఎంకే నేత అన్నాదురై సమాధి సమీపంలోనే కరుణానిధి ఖననానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేమన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని న్యాయమూర్తులు ప‌క్క‌న‌పెట్టారు. కోర్టు తీర్పు తెలుసుకున్న‌ రాజాజీ హాలు వద్ద ఉన్న కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ కంటతడి పెట్టారు. భావోద్వేగంతో డీఎంకే మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అన్నాదురై సమాధి పక్కన క‌రుణానిధి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని డీఎంకే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించడంతో డీఎంకే మంగ‌ళ‌వారం రాత్రే హైకోర్టును ఆశ్రయించింది. డిఎంకె పిటిష‌న్‌ను హైకోర్టు అర్థరాత్రి విచారణ చేపట్టింది. బుధ‌వారం ఉదయం 8గంటల్లోగా వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించిన దాఖలాలు లేవని ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత ముఖ్యమంత్రులుగా కన్నమూసినందునే మెరీనా బీచ్‌లో వారి దహన సంస్కారాలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని వివ‌ర‌ణ‌లో ప్ర‌భుత్వం పేర్కొంది. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి (సిఆర్‌జెడ్‌) నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో 2ఎకరాలను కేటాయించినట్లు పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్ తుదిస్వాస విడిచిన‌ప్పుడు డీఎంకే అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా నాడార్‌ అంతిమ సంస్కారాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేదని గుర్తుచేసింది. ఎంజీఆర్‌ భార్య జానకి రామచంద్రన్‌కు కూడా డీఎంకే ప్రభుత్వం మెరీనాలో స్థలం కేటాయించలేదని తెలిపింది.

పిటిష‌న్‌పై డీఎంకే న్యాయవాదులు కోర్టులో త‌మ వాద‌న‌లు వినిపిస్తూ జయలలిత స్మారకానికి 3500 చదరపు అడుగుల స్థలం కేటాయించిన ప్ర‌భుత్వం తమిళ ప్రజలకు ఎంతో సేవ చేసిన కరుణానిధికి ఆరడుగుల స్థలం కూడా కేటాయించలేదా అని ప్ర‌శ్నించారు. మెరీనా బీచ్‌లో స్థ‌లం కేటాయించ‌క‌పోతే ఏడు కోట్ల తమిళుల్లో డిఎంకె అభిమానులుగా ఉన్న‌ కోటి మంది మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించ‌కుంటే అవమాన పరిచినట్లే అని కోర్టులో వాద‌న వినిపించారు. కామరాజ్‌ నాడార్‌ అంత్యక్రియల స‌మ‌యంలో అప్ప‌టి కాంగ్రెస్ మెరీనాలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వాన్ని కోర‌లేద‌ని డీఎంకే స్పందించింది. తాము స్మారకం క‌ట్టేందుకు అడ‌గ‌డంలేద‌ని, కేవలం ఖననం చేసేందుకు స్థలం అడుగుతున్నామని కోరారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకానికి తీసుకున్న అనుమతి చూపించాల‌ని మద్రాస్ హైకోర్టు అధికార‌ అన్నాడీఎంకేను కోరింది. మెరీనా బీచ్‌లో అంతిమ సంస్కారాలు, ఎలాంటి కట్టడాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని గతంలో దాఖలైన పిటిషన్లను కూడా ఆయా పిటిషన్‌దారులు వచ్చి వెనక్కి తీకోవ‌డంతో న్యాయస్థానం వాటి ఉపసంహరణకు అంగీక‌రించింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వానికి ఉన్న‌ అభ్యంతరాలు ఏంట‌ని కోర్టు అన్నాడీఎంకేను ప్ర‌శ్నించింది. ఇరువైపుల వాద‌న‌లు విన్న‌త‌ర్వాత‌ కలైంజ్ఞర్‌ అంత్యక్రియలు మెరీనాలో జ‌రిపేందుకు అంగీక‌రించారు.

కరుణానిధికి నివాళులర్పించిన మోదీ
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులర్పించారు. బుధ‌వారం ఉదయం చెన్నై చేరుకున్న మోడీ రాజాజీ హాల్‌కు వెళ్లి అక్కడ కరుణ పార్థివదేహానికి అంజలి ఘటించారు. అనంత‌రం స్టాలిన్‌, కనిమొళిని పరామర్శించారు.

క‌రుణానిధి మరణ వార్త తెలియగానే ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ‘భారత రాజకీయ నాయకుల్లో అత్యంత సీనియర్‌ నేత కరుణానిధి. ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆలోచనాపరుడు, మాస్‌ లీడర్‌, గొప్ప రచయితను మనం కోల్పోయాం. ప్రజల సంక్షేమం కోసమే ఆయన తన జీవితాన్ని అంకింతం చేశారు. ప్రాంతీయ అభివృద్ధి కోసమే కాకుండా జాతీయ పురోగతి కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారు. తమిళుల సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నారు. తమిళుల గొంతును సమర్థంగా వినిపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పలు సందర్భాల్లో కలుసుకునే అవకాశం నాకు కలిగింది. ప్రజాస్వామ్య ఆదర్శాలకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. సాంఘిక సంక్షేమానికి ఆయన ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. తమిళనాడుతో పాటు భారత్‌ ఓ గొప్ప నేతను కోల్పోయింది’ అని మోదీ మంగ‌ళ‌వారం ట్వీట్‌ చేశారు.

https://youtu.be/pFvxlsNINQc

దేశం మహానేతను కోల్పోయింది: చంద్రబాబు
విజయవాడ : తమిళనాడును అగ్రశ్రేణిగా తీర్చిదిద్దడంలో కరుణానిధి సేవలు అసమానమని ఎపి సిఎం చంద్రబాబునాయుడు కీర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్‌ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా క‌రుణానిధికి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. “కరుణానిధి రాటుదేలిన రాజకీయ వేత్త. కోట్ల మందిని ప్రభావితం చేసిన విలక్షణ నాయకుడు. తమిళనాడులో తిరుగులేని నేత. దక్షిణ భారతదేశంలో పెద్ద రాజకీయ శక్తిగా కొనసాగారు. రాజకీయ రంగంలోనే కాకుండా కళా రంగంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఎన్నో సామాజిక మార్పులకు నాంది పలికారు. కరుణానిధితో నాకు మంచి అనుభవం ఉంది. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినప్పుడు కరుణానిధి అండగా నిలిచారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఏర్పాటుచేసుకున్న కరుణానిధి చనిపోవడం తమిళనాడుతో పాటు దేశానికి తీరని లోటు’ అని చంద్ర‌బాబు అన్నారు.