Home ప్రకాశం మానవాళి మనుగడకు ‘పచ్చతోరణం’ : ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

మానవాళి మనుగడకు ‘పచ్చతోరణం’ : ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

366
0

టంగుటూరు (కారుమంచి) : మానవాళి మనుగడకు మొక్కల పెంపకం ఆవశ్యకతను గుర్తెరగాలని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. కారుమంచిలో ‘మాఊరు అభివృద్ధి కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మాఊరు అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్న లక్ష్మణరెడ్డి కారుమంచిని హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ కూడలి నుంచి మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో రోగ నిరోధకశక్తిని పెంపొందించేందుకు పచ్చదనం చాలా ఉపయోగ పడుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పచ్చతోరణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వీటిలో 6కోట్ల మొక్కలను ప్రభుత్వం అందిస్తుండగా, మరో 10కోట్ల మొక్కలను వివిధ పేపరు మిల్లుల యాజమాన్యాలు ఇవ్వనున్నాయని అన్నారు. వాటికితోడు మరో 4కోట్ల మొక్కలను వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇతరులు అందించే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.

పచ్చతోరణం కార్యక్రమం కార్తీక మాసం పూర్తయ్యే వరకూ ఒక యజ్ఞంలా సాగుతుందని తెలిపారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భూ భాగంలో కేవలం 23శాతం మాత్రమే అటవీ భూములున్నాయని, ఇప్పటికైనా మేల్కొని వీటిని మరింతగా పెంచుకోకపోతే భవిష్యత్‌ తరాలకు ప్రకృతిపరమైన ఇబ్బందులు తప్పవని లక్ష్మణరెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతమున్న 23శాతం అటవీ భూమిలో కూడా కేవలం 17శాతం మాత్రమే పచ్చదనంతో ఉందన్నారు. బయట ప్రాంతంలో కేవలం 3శాతం మాత్రమే పచ్చదనం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కనీసం 33శాతం భూభాగం పచ్చదనంగా ఉండేలా చేయాలన్నారు. అందులో భాగంగానే మొత్తం భూ భాగంలో 10శాతం మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి భూభాగంలో పచ్చదనం తగ్గడంతోనే హుద్‌- హుద్‌ వంటి విపత్కర పరస్థితులు ఎదురయ్యాయని గుర్తుచేశారు. హుద్‌-హుద్‌ తరువాత వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల నుండి మన భావి తరాలను కాపాడుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఇంటింటికీ మొక్కలతో పాటు వాటి సంరక్షణకు ట్రీ గార్డులివ్వడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా మనమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కారుమంచి మాజీ సర్పంచి ఆనం సత్యనారాయణరెడ్డి, గ్రామపెద్దలు బత్తుల కృష్ణ, మల్లవరపు రాఘవరెడ్డి, మాలె నారపరెడ్డి, దుగ్గిరాల పేర్రాజు, కసుకుర్తి నవీన్, బాలకృష్ణారెడ్డి, కందుల రాజారావు, దోనేంపూడి జయరావు, మన్నం దిలీప్, ఎస్కె సుల్తాన్, టంగుటూరు, మల్లవరం, మర్లపాడు, కందులూరు, అనంతవరం, పాకల తదితర గ్రామ నేతలు పాల్గొన్నారు.