Home బాపట్ల గోవా తరహాలో సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రణాళిక : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

గోవా తరహాలో సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రణాళిక : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

8
0

బాపట్ల (DN5 News) : గోవా తరహాలో సూర్యలంక బీచ్‌ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌కుమార్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. పర్యాటక రంగం వృద్ధికి నూతన విధానాలతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల గోవా పర్యటన గొప్ప అనుభవాలు, అనుభూతిని మిగిల్చాయని అన్నారు. ఇప్పటికే 35పేజీలతో ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామన్నారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిస్తామని అన్నారు. గోవా చిన్న రాష్ట్రం అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుందని అన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్నంత జనాభా మన జిల్లాలో ఉందన్నారు. మంచి ప్రణాళికతో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడం ద్వారా బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా ప్రాచుర్యం పొందిందన్నారు.

పోలీసుల భద్రత, రవాణాశాఖ ద్వారా ప్రజల రవాణాకు వాహనాల సౌకర్యం, ప్రతినెల పెద్ద ఎత్తున సంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వంటివి అక్కడ జరుగుతాయన్నారు. అదే తరహాలో బాపట్లలోని బీచ్ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమవుతుందన్నారు. అధికారులతో గోవా పర్యటించి, అధ్యయనం చేయడం నూతన అనుభవాలు నేర్పాయని అన్నారు. ఇలాంటి పర్యటనలు, అధ్యయనాలు అధికారులకు ఉండాలని అన్నారు. అధికారులు సమగ్ర ప్రణాళిక, పట్టుదలతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలరన్నారు.

ఆర్మీ ఫ్లాగ్ డే సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు డి ఆర్ డిఏ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. డ్వాక్రా మహిళలంతా కలిసి రూ.10.54 లక్షలు విరాళాలు ఇవ్వడం చాలా సంతోషదాయకం అన్నారు. చెక్కు రూపంలో ఆ నగదును సైనిక సంక్షేమ శాఖకు అందజేశారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధపడుతున్న వేటపాలెం మండలానికి చెందిన ఎస్సీ అభ్యర్థి ప్రొద్దుటూరు దినకర్‌కు పిఎంఎజెఎవై పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిజిటల్ ట్యాబ్‌ను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అంతర్జాతీయ వినికిడి దినోత్సవంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన గోడపత్రాలను విడుదల చేశారు. వైద్య పరీక్షలపై అధికారులకు అవగాహన కల్పించారు.

సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, డిఆర్‌డిఎ బి సింగయ్య, సైనిక సంక్షేమ శాఖ అధికారిని గుణశీల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణ అధికారి జిఎన్ నరసింహారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.