బాపట్ల (DN5 News) : పీజీఆర్ఎస్‌లో ప్రజలు ఇచ్చిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట (IAS Bhavanavasishta) అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావిజ్ఞప్తుల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాల ద్వారా ఆమెను వేడుకున్నారు. తన పరిధిలోని వాటికి తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నిటిని పరిశీలన, మరికొన్నిటిని విచారించించాలని సంబంధిత అధికారులకు పురమాయించారు.
జిల్లాలోని అందరు తహసిల్దార్లతో వీక్షణ సమావేశం ద్వారా సమస్యల పరిష్కారంపై అడిగి తెలుసుకున్నారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. పిజిఆర్ఎస్‌లో 197 అర్జీలు నమోదు అయ్యాయి. నమోదైన అర్జీలను నిశితంగా పరిశీలించిన తదుపరి పరిష్కరించాలని అన్నారు. గడువు తీరిన అర్జీలు పెండింగులో లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజలకు మేలు జరగాలంటే అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. అధికారుల పనితీరుతోనే ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ లవన్న, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, గుంటూరు జెడ్పీ డిప్యూటీ సిఇఒ కృష్ణ పాల్గొన్నారు.






