చీరాల (Chirala) : పరిశుబ్రతతోనే ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉందని ఇన్‌ఛార్జి కలెక్టర్ భావన వశిష్ట అన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాల వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. వ్యర్థ రహిత పాలన అంశంపై అవగాహన చేపట్టారు. వీధుల్లో వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. మార్గ మధ్యంలో టిఫిన్ సెంటర్లు, హోటళ్ల వద్ద పరిశుభ్రతపై ఆర్డీఒ టి చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. అనంతరం సమైక్యత చాటుతూ పాఠశాలలో మానవహారం నిర్వహించారు. ‘నా ఇంటిని, పరిసరాలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచుతానంటూ అందరి చేత ఇంచార్జి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈనెల 26న రేపల్లెలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రాలు ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట విడుదల చేశారు.

మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే వీధులను శుభ్రంగా ఉంచాలని ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట చెప్పారు. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. అభివృద్ధి చెందే దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. అభివృద్ధి లక్ష్యంగా స్వచ్ఛత, పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఇంటి వద్దనే తడి, పొడి చెత్తలు వేరు చేయాలని ఆమె సూచించారు. రేపటి పౌరులుగా ఎదిగే నేటి విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన పొందాలన్నారు.

వ్యర్థ రహిత పాలనకు ప్రజలంతా సహకరించాలని చీరాల ఆర్డీఒ చంద్రశేఖర్ చెప్పారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా వినియోగిస్తే జరిమానాలు విధించాలని అన్నారు. బయట మార్కెట్లో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని అన్నారు. పారిశుద్ధ్యంపై అందరూ కలిసి పని చేయాలని అన్నారు. మన ఇంటి మాదిరిగా మన వీధులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్రత కార్యక్రమాలపై చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు సూచించారు.

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపాలిటీ కమిషనర్ కె డానియల్ జోసెఫ్ తెలిపారు. వాణిజ్య సంస్థలు, హోటళ్లలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని అన్నారు. లేకుంటే జరిమానా విధిస్తామన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అందుకోసంప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచంద్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పి సుబ్బయ్య, సిపిఓ షాలేము రాజు, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ మాధవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







