పామూరు (Pamuru) : దూబగుంట గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ఐఐఐటి కాలేజీకి భూమి పూజ చేసిన స్థలంలోని తిరిగి కాలేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు సయ్యద్ హానీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుందరయ్య భవనం సెంటర్లో చంద్రబాబు నాయుడుకు ‘బహిరంగ లేక’, సంతకాల సేకరణను యుటిఎఫ్ (UTF)నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు గల్లా చెన్నయ్య, శ్రీనివాసరాజు సంతకం చేసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ 2018లో చంద్రబాబు మండలంలోని దూబగుంట గ్రామంలో త్రిబుల్ ఐటీ (IIIT College) కాలేజీకి అప్పటి శాసన సభ్యులు కదిరి బాబురావు కాలంలో భూమి పూజ చేశారని అన్నారు. కదిరి బాబురావు నిర్లక్ష్యం కారణంగా కాలేజీ ప్రారంభానికి నోచుకోలేదని ఆరోపించారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిని వైసిపి (YSRCP) ప్రభుత్వంలో ఎంఎల్‌ఎగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ కనిగిరి మండలం బల్లిపల్లిలో నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారని అన్నారు. వైసిపి ఐదేళ్లు కాలయాపన చేసిందని అన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ప్రస్తుత ఎంఎల్‌ఎ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి (MLA Mukku Ugra Narasimha Reddy)బల్లిపల్లిలో కాలేజీ పెట్టేది లేదని, చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన ప్రాంతంలోని కాలేజీ నిర్మించాలని పామూరు నుండి ధూబగుంట వరకు పాదయాత్ర చేసి సెల్ఫీ ఫోటోలతో పేపర్ ప్రకటన చేసుకున్న విషయం మర్చిపోయారని హనీఫ్ ఆరోపించారు.
ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పట్టుదలతో తిరిగి దూబగుంటలోనే ఐఐఐటి కాలేజీ నిర్మాణం చేపట్టాల్సింది పోయి వైసీపీ ప్రకటించిన ప్రాంతంలో నిర్మాణం చేపడతామని ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసం చేసినట్లు అవుతుందని అన్నారు. దూబగుంటలో కాలేజీ రాకపోతే రాజకీయానికి దూరంగా ఉంటానని సవాలు విసిరిన మాటలు గుర్తుకు రాలేదని ఆరోపించారు. కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని కోరారు. రేపటి నుండి ప్రతి గ్రామంలో సంతకాలు సేకరించి సిఎం చంద్రబాబుకు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, షేక్ ఖాదర్ భాషా, కె మాల్యాద్రి, యాట వీరనారాయణ, సిహెచ్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, పిచ్చిరెడ్డి, కె శంకర్, ఐద్వా నాయకులు సయ్యద్ షమీ, కె ధనలక్ష్మి, సయ్యద్ రమీజా పాల్గొన్నారు.






