చీరాల : గడియార స్తంభం సెంటర్ లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వరవరరావు, జిఎన్ సాయిబాబా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత జన సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ వరవరరావు 50 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం ఒక కవిగా పీడిత ప్రజల కోసం ఎంతో పాటుపడ్డాడని చెప్పారు. నిర్బందానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించి భీమా కోరేగావ్ కుట్ర కేసులో విచారణ లేని ఖైదీగా 81సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా ఆయన శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా 90% అంగవైకల్యంతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న ఎటువంటి విచారణ లేకుండా ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల నాయకులు, పిడిఎం జిల్లా కార్యదర్శి వెంకట్, దుడ్డు విజయ్ సుందర్, మేడ వెంకటరావు, బక్క జయరామిరెడ్డి, దేవన వీరనాగేశ్వరరావు, బీరక పరమేష్, కర్ణ హనుమంతరావు, నలతోటి బాబురావు, బత్తుల సామ్యేల్, బెజ్జం విజయకుమార్, ఊటుకూరి వెంకటేశ్వర్లు, పులిపాటి రాజు, లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.