బాపట్ల (భట్టిప్రోలు) (DN5 News) : మీ భూమి-మీ హక్కు గ్రామసభ, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో గురువారం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతులు పాస్ పుస్తకాలను చూపుతూ హర్షాతీ రేఖలు కరతాలధ్వనుల మధ్య ముఖ్యమంత్రి ప్రసంగం చేశారు. పి4కి స్పందిస్తూ యాజలి గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజు రూ.ఒక కోటి చెక్కు రూపంలో విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్రం ఆమోదించిన తదుపరి తొలి సభ బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో జరగడం సంతోషదాయకమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవిన్యూ సమస్యలన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మీ భూములకు రక్షణ కల్పించడం, శాశ్వతంగా మీ భూమికి యాజమాన్య హక్కు కల్పిస్తూ రాజమద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని అన్నారు. ఎక్కడ తప్పులు జరగకుండా పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రజల్లో విశ్వసనీయతను కల్పిస్తూనే సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. ప్రజలందరికీ బంగారు భవిష్యత్తు కల్పించడం కొరకే రాజధాని అమరావతిని సాధించినట్లు అభివర్ణించారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ఆశిస్తున్న అమరావతిని రాజధానిగా కేంద్రంలో చట్టబద్ధత పదేళ్ల సీఎం కృషి చేశారన్నారు. దేవతలు నివాసం ఉన్న అమరావతిని రాజధానిగా పొందడం గొప్ప భాగ్యం అన్నారు. ఐటి మంత్రి నారా లోకేష్ బాబు ఆలోచనలతో దేశంలో పెట్టుబడులన్ని రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.

మన భూమికి మన హక్కులు ఉండాలని ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. మన జిల్లాకు వచ్చి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం సంతోష దాయకమన్నారు. అమరావతి రాజధాని బిల్లు ఢిల్లీకి రాగానే మద్దతుపై లోక్ సభలో ప్రకటన చేయగా 11 జాతీయ పార్టీలు, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించడం అభినందనీయమన్నారు. ఆ సమయంలో లోక్ సభ పానెల్ స్పీకర్‌గా నేను ఆమోద ముద్ర వేయడం, తెలుగు బిడ్డగా నా జన్మ సుకృతం అయ్యిందన్నారు. ఢిల్లీ లోక్ సభలో తెలుగు బిడ్డగా స్పీకర్ స్థానంలో ఉండి ఆమోదించడంలో భావోద్వేగానికి గురయ్యానని గుర్తు చేసుకున్నారు. సభ్యుల ఆమోదం కోరడం, ఆమోదించడం నా జీవితంలో మరుపురాని రోజు అన్నారు. అమరావతికి రాజముద్ర లభించిందని, సింగపూర్ మాదిరిగా అమరావతి అభివృద్ధి చేయడానికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. బాపట్ల జిల్లాలో రైల్వే లైన్ల అభివృద్ధికి రూ.8వేల కోట్లు నిధులు కావాలని ప్రతిపాదనలు పంపామన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ.6 వేల కోట్లు ప్రతిపాదనలు పంపామని, భట్టిప్రోలు బౌద్ధ స్తూపం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కావాలని ప్రతిపాదనలు పంపామన్నారు.
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సిఎం బాపట్ల జిల్లాకు రావడం సంతోషంగా ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గ్రామ ప్రజలు ఆసక్తిగా కార్యక్రమానికి హాజరు కావడం అభినందనీయం అన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి ఐదు వారాలలో అర్హమైన వాటిని తొలగించి భూమి హక్కు కల్పిస్తామన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. తుంగభద్ర కాల్వ మరమ్మతు పనులకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. పొన్నూరు రోడ్డుపై హెచ్ఎల్‌పి నిర్మాణానికి రూ.15 కోట్లు కావాలని, భట్టిప్రోలు- పెసర్లంక కల్వర్టు నిర్మాణానికి రూ.రెండు కోట్లు నిధులు కావాలని, జువ్వలపాలెం రహదారుల మరమ్మతులు, గ్రోయింగ్ నిర్మాణానికి రూ.రెండు కోట్లు, అగ్నిమాపక స్టేషన్ ఏర్పాటు చేయాలని, జంపని గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఆ భూమిని ఎంఎస్ఎంఈ పార్కుగా నిర్మించాలని కోరారు.
నాకు ఎంతో సంతోషంగా ఉంది : భట్టిప్రోలు రైతు ఉప్పల నాంచారయ్య
ఎంతో కాలంగా తాతావారిపాలెంలో సాగు చేసుకుంటున్న తన భూమికి హక్కు పత్రాలు లేవని, ఎన్నోసార్లు అధికారులు కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని భట్టిప్రోలుకు చెందిన ఉప్పుల నాంచారయ్య అన్నారు.. ఇప్పుడేమో నా భూమికి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. జీవిత కాలం రుణపడి ఉంటా. నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, జిల్లా ఇన్చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సిసిఎల్ఎ కార్యదర్శి జయలక్ష్మి, ఐఎఎస్ అధికారి ప్రత్యూమ్న, సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






