Home బాపట్ల ప్రారంభమైన పర్చూరు, ఇంకొల్లు రోడ్డు పనులు

ప్రారంభమైన పర్చూరు, ఇంకొల్లు రోడ్డు పనులు

12
0

•తొలగనున్న వాహనదారులు, ప్రజల ఇబ్బందులు
•కాంట్రాక్టర్, శాఖల మధ్య సమన్వయం చేసిన ఏలూరి
•ఎమ్మెల్యే ఏలూరి సమీక్షతో తొలగిన అడ్డంకులు
•త్వరితగతిన పనులు పూర్తిచేసేలా కీలక ఆదేశాలు
పర్చూరు (DN56 News) : ఎట్టకేలకు పర్చూరు, ఇంకొల్లు ఆర్ అండ్‌ బి రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) నిరంతర కృషి, అధికారులతో వరుస సమీక్షల ఫలితంగా నిలిచిపోయిన పనులు ప్రారంభించారు. పనులు పూర్తయితే ఎన్నో ఏళ్ళుగా వాహనదారులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ రోడ్డు అనేక గ్రామాలకు ప్రధాన రవాణా మార్గంగా ఉండటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రధానమైన రోడ్డు. గత కొంతకాలంగా రోడ్డు దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ఈ సమస్యను గమనించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆర్ అండ్‌ బి అధికారులు, కాంట్రాక్టర్, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం లోపించడం, సాంకేతిక సమస్యల వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని గుర్తించి అడ్డంకులు తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.

తొలగిన అడ్డంకులు
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమీక్ష అనంతరం సాంకేతిక, పరిపాలనా సమస్యలు పరిష్కారం అయ్యాయి. అవసరమైన అనుమతులు, వనరుల సమీకరణపై దిశానిర్దేశం చేశారు. నాణ్యతతో పాటు వేగంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ప్రజాసౌకర్యమే ప్రాధాన్యం
ప్రజల సౌకర్యమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. పనుల్లో ఎలాంటి అలసత్వం సహించకుండా నిర్ణీత గడువులో రోడ్డు పనులు పూర్తి చేయాలని అన్నారు. పనుల పురోగతిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో పర్చూరు, ఇంకొల్లు పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమస్య పరిష్కార దిశగా అడుగులు పడటంతో స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పనులు పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.