ప్రకాశం (దమ్ము) : టంగుటూరు మండలం అనంతవరం ఎస్సీ కాలనీలో షుమారు 50ఏళ్ళ క్రితం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అనంతవరం దళితులు ఆత్మగౌరవంగా భావించారు. ప్రస్తుతం ఎస్సీ కాలనీలో ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని ఉన్నత వర్గాల నివాస ప్రాంతంకు మార్చడం తమపై వివక్ష చూపడమేనని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ సచివాలయం పేరుతో నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కాలనీ వాసులు చెబుతున్నారు.
ఐతే వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్, పిడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాత్రం గతంలో ఉన్న ఎస్సీ కాలనీలోనే సచివాలయం నిర్మాణం చేపడతామని అక్కడి ఎస్సీ కాలనీ వాసులకు ఇప్పటికే హామీ ఇచ్చి ఉండడం గమనార్హం. ఇక్కడి మెజారిటీ ఎస్సీలంతా వైసీపీకి ఓట్లేసినవారే. ఇప్పుడు వాళ్లే వారి ఆత్మగౌరవం కోసం ఓట్లేసిన వైసీపీ పై పోరాటం చేస్తున్నారు.
ఎస్సి కాలనీలో పంచాయతీ భవనం ప్రారంభం ఇలా…
టంగుటూరు మండలంలోని అనంతవరం, తేటుపురం, తాళ్లపాలెం, పసుకుదురు, కేసుపాలెం గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉంది. ఈ పంచాయతీలో షుమారు 1700ఓట్ల జనాభా కలిగి ఉన్నారు. అనంతవరం గ్రామం మొత్తం కలిపి ప్రస్తుతం 700మంది ఓటర్లు ఉంటే ఒక్క ఎస్సీ కాలనీలోనే 500 ఓటర్లు ఉన్నారు. పంచాయతీ మొత్తంమీద ఎస్సీలే మెజారిటీ జనాభా కలిగివున్నారు. జిల్లా సమితి అధ్యక్షులు లింగారెడ్డి మద్దతుతో 1968లో అనంతవరం (మాలపల్లె) ఎస్సీ కాలనీకి చెందిన కసుకుర్తి రామలింగం జనరల్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచారు. అప్పటివరకు ఎవరు సర్పంచ్ గా ఉంటే వారి ఇంటి నుండే పరిపాలన జరుగుతుండేది. రామలింగం సర్పంచ్ గా ఉంటూ తన పల్లె జనాలను చైతన్య పరిచి, తన భుజాన ఉన్న కండువా పల్లెలోని గుడి ముందు పరిచి, పల్లెలోనే పంచాయతీ ఉండేలా భవన నిర్మాణానికి విరాళాలివ్వాలని కోరారు. పల్లె జనం ఐదు, పది రూపాయలు విరాళాలు అందజేసి, ఇంటికొక్కరుగా బక్కెట్లతో సిమెంటు మోసి, శ్రమతో ఎస్సీ కాలనీలోని మూడున్నర సెంట్ల స్థలంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఆ తర్వాత అదే కాలనీకి చెందిన కసుకుర్తి రాజారావు 1981లో సర్పంచ్ గా ఉన్న సమయంలో జిల్లా సమితి అధ్యక్షులు పోతుల చెంచయ్య నిధుల ద్వారా అదే పంచాయతీ భవనాన్ని పునరుద్ధరణ చేసి ఆయన చేతే ప్రారంభింపజేశారు. అనంతరం 2002లో అగ్రవర్ణాలకు చెందిన సోమరాజుపల్లి నరసింహరావు పంతులు సర్పంచ్ గా అదే పంచాయతీ భవనాన్ని పునరుద్ధరించి అక్కడి నుండే గ్రామ పరిపాలన కొనసాగించారు. ఇప్పటికీ ఆ పంచాయతీ భవనాన్ని దళితులు ఆత్మగౌరవ చిహ్నంగా భావిస్తున్నారు.
వైయస్సార్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ సచివాలయం నుండే పరిపాలన జరుగుతుందని, గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చివేశారు. అందులో భాగంగా అనంతవరం, వెలగపూడి, ఆలకూరపాడు (ఒక క్లస్టర్), టంగుటూరు (ఒక క్లస్టర్) గ్రామాలను కలిపి ఇంటిగ్రేటెడ్ సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇదే అవకాశంగా ఊర్లో ధనవంతులు, గ్రామంలో, మండలంలో పెత్తందారుల ప్రాధాన్యత, ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఎస్సీ కాలనీలో ఇప్పటికే ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని తీసుకువెళ్లి, ఇంటిగ్రేటెడ్ సచివాలయం పేరుతో ఊర్లో నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తుండడంతో ఆగ్రహించిన మెజారిటీ ఎస్సీలు ఉద్యమబాటపట్టారు.
గ్రామపంచాయతీ మొదటి నుండి గ్రామంలో మెజారిటీ ప్రజలుగా ఉన్న తమ ఎస్సీ కాలనీలోనే ఉందని ఇక్కడి నుండి ఎందుకోసం తరలిస్తున్నారని ఎస్సీ కాలనీ వాసులంతా పంచాయతీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులకు, వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్యకు మెమోరాండం ద్వారా విన్నవించుకున్నారు.
ఇంటిగ్రేటెడ్ సచివాలయానికి నలచదరం ఉన్న స్థలం కావాలని అధికారులు తెలిపారు. అక్కడికి ప్రక్కనే అంగనవాడి కేంద్రం వద్ద 15సెంట్ల స్థలం అనువుగా ఉన్న ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాటు చేయాలని కోరడంతో వెంకయ్య కూడా ఎస్సీలు కోరిన చోటే సచివాలయం ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఎస్సీ కాలనీలోనే సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎస్సీలు అనుకుంటున్నారు.
ఎస్సీ కాలనీ వాసులు మాత్రం అనంతవరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ సచివాలయం అవసరం లేదని ఇక్కడ పాడి పరిశ్రమ కానీ వ్యవసాయ భూములు కానీ ఇక్కడ లేవని, అనంతవరం పంచాయతీ పరిధిలో ఉన్న భూములన్నీ ఉప్పునీటి రొయ్యల చెరువుల సాగు మాత్రమే జరుగుతుందని అంటున్నారు. పదివేల జనాభా కలిగి, పాడి పరిశ్రమ, వ్యవసాయ భూములున్న ఆలకూరపాడులో ఇంటిగ్రేటెడ్ సచివాలయం ఏర్పాటు చేయాలని ఎస్సీలు కోరుతున్నారు. ఇక్కడి ఎస్సీలమంతా కలిసి గత పంచాయతీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ పార్టీకి ఓట్లేసి, తమ కాలనీకి చెందిన వైసీపీ అభ్యర్థిని గెలిపించుకున్నందుకు పాలక పార్టీ నాయకులు తమకు అన్యాయం చేయడం దారుణమని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన (మాలపల్లె) ఎస్సీ కాలనీలోనే సచివాలయ నిర్మాణం జరగకపోతే, జిల్లాలోని దళితులను కలుపుకుని మా పల్లెలో ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని తరలిస్తే ఊరుకోమని “అనంతవరం దళితుల ఆత్మగౌరవ పోరాటంగా ఉద్యమిస్తామని” చెబుతున్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకై గ్రామంలోని ఉద్యోగులు, విద్యార్థులు, కాలనీ వాసులు కలిసి చర్చించుకుంటున్నట్లు తెలిసింది. అనంతవరం మాలపల్లెలో అందరూ విద్యావంతులే. ఇంటికి ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. పల్లెలో ఏ కార్యక్రమం చేయాలన్నా ఉద్యోగుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. అనంతవరం ఉద్యోగుల సంఘం, అంబేద్కర్ యువజన, విద్యార్థి సంఘాలు తమ పల్లెలో ఉన్న పంచాయతీ కార్యాలయం తరలిస్తే ఊరుకునేది లేదంటూ, తమ పల్లెలోనే సచివాలయం ఉండాలనే డిమాండ్ తో ఐక్యంగా ఉన్నారు.