– ఇక్కడ అవినీతి బహిరంగ రహస్యం – ఫోన్ పే, గూగుల్ పే ద్వారా లాంచాల వసూళ్లు – వసూళ్ల లెక్కలన్నీ టౌన్ ప్లానింగ్ లాప్టాప్లో ప్రత్యక్షo – ఒంగోలులో రు.2కోట్ల డిజిటల్ అక్రమ లావాదేవీలు – మున్సిపల్ స్థలాల్లో (స్కూల్) ప్రైవేటు నిర్మాణాలకు అనుమతి – లక్షల నుంచి కోటి దాటేసిన కమిషనర్ పోస్టింగ్ – ఇంత జరుగుతున్నా సమీక్ష చేయని ఎంఎల్ఎ – మసకబారుతున్న ప్రభుత్వ ప్రతిష్ట
ఒంగోలు (DN5 News) : నగర పాలక సంస్థలో అవినీతి పేట్రేగిపోతోంది. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసారు. అది కూడా రొటీన్గా చెయ్యాల్సిన పనికి. చెయ్యకూడని పనికైతే రేటు పనిని బట్టి నిర్ణయిస్తారట. ఈ మాట చెబితే ప్రతిపక్షం అనే ముద్ర వేస్తారు కానీ అదే మాటని నేడు ఏసీబీ చెపుతుంది.
దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిందని ఎప్పుడు చెప్పే తెలుగుదేశం ప్రభుత్వం తమ నాయకత్వంలో అవినీతి ఎంతగా పెరిగిపోయిందో చూడలేకపోవడం ఆశ్చర్యం. లేదా చూసి చూడ కుండా ఉన్నారేమో? ఎందుకో, ఏమో, వారే చెప్పాలి.
ఇప్పుడు గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే అవినీతి రేటు 100శాతం పెరిగింది. ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు. ఇది గత ప్రభుత్వంలో ఉన్న రేటుకి రెట్టింపు అయింది. (అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో) అడిగేవాడు లేడు. దీనిపైన ఎవరి నియంత్రణ లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకోరు.
కార్పొరేషన్ అవినీతి కంపు : ఒంగోలు కార్పొరేషన్ అవినీతిలో మునిగిపోయిందని ఎప్పుడూ చెప్పే జనార్ధన్ అధికారంలోకి రాగానే అదే కార్పొరేటర్లను తన పార్టీలో చేర్చుకుని ఈ అవినీతి పర్వాన్ని చూసి చూడనట్టు ఊరుకున్నారు. చెప్పేది ఒకటి. చేసేది ఒకటి. ప్రభుత్వ ఏదైనా అవినీతి మామూలేనని ప్రజలకు అర్థమయింది.
ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి కార్పొరేటర్లతో సంబంధం లేని బిపిఎస్ వ్యవహారంలో రు.10 కోట్ల అవినీతి జరిగిందని ఏసిబి లెక్కలు వేస్తోంది. కింద నుంచి పై స్థాయి వరకు ఉన్న అధికారులందరికీ దీనిలో వాటాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ లోని ఒక అధికారి తన ద్వారా జరిగిన అక్రమ లావాదేవీల మొత్తాన్ని ఏ అధికారికి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాడనేది రాసుకున్న సమాచారం లాప్టాప్ లో నిక్షిప్తమై ఉంది. అది కూడా ఏసీబీ అధికారులకు దొరికింది.
ప్రతివారం సమీక్ష చేసే శాసనసభ్యులు జనార్దన్ కు ఈ విషయం తెలియదంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తెలిసినా తమ పనులు చేస్తే చాలని అనుకుంటున్నారేమో. వారి నాయకత్వంలో ఒంగోలు నగరపాలక సంస్థ ప్రతిష్ట మసకబారిందనేది ఎవరు కాదనలేని సత్యం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగిన ఏసీబీ దాడులు. ఎంత దారుణం అంటే టౌన్ ప్లానింగ్ విభాగంలో రు.2కోట్లు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది.
డిజిటల్ పేమెంట్లే రు.2కోట్లు అంటే ఆ విధంగా కాకుండా చాలా తెలివిగా ఇతరుల ఫోన్ నెంబర్లు ఇచ్చి లేదా ఇతరుల ద్వారా స్వంతంగా నగదు తీసుకున్నది రు.10 కోట్ల వరకు ఉందని అంచనా. ఈ విషయం మున్సిపల్ కార్యాలయంతో సంబంధం ఉన్న అందరికీ తెలుసు. కానీ శాసనసభ్యులకు తెలియక పోవడం ఆశ్చర్యం.
అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలకు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో డబ్బులు తీసుకుని అనుమతి ఇవ్వలేని భవనాలకు ఇబ్బడి ముబ్బడిగా కట్టుకోవడానికి కళ్ళు మూసుకుని అనుమతించారు. అందువల్లనే ఘనంగా రు.70కోట్లు బీపీఎస్ ద్వారా వస్తుందని చెబుతున్నారు. అంటే అన్ని అక్రమ కట్టడాలను పెంచి పోషించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఒక్క టౌన్ ప్లానింగ్ విభాగంలో బిపిఎస్ నిమిత్తం రు.10 కోట్ల అవినీతి జరిగిందంటే రెవెన్యూ, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగంలో జరిగిన అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కాలువ మరమ్మత్తు నిమిత్తం సంబంధం లేకపోయినా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రు.10 లక్షలు అనుమతి తీసుకుని రు.కోటి వరకు బిల్లులు చేసుకున్నట్లుగా ప్రచారంలో ఉంది. అదే విధంగా ఇంజనీరింగ్ భాగంలో అన్ని పనులు 40శాతం మాత్రమే చేస్తారు. మిగిలినవన్నీ పర్సెంటేజీ రూపంలో పైనుంచి కిందకి వెళ్తాయి. ఇంకో ఆశ్చర్యకరమైన ఏమిటంటే రు.70 కోట్ల పనులు చేయించిన ఘనత నగరపాలక సంస్థ కమిషన్ కు దక్కుతుంది.
అదీ నిధులు లేకుండా. దీనికి ఆ అధికారిని ఏమనాలో? పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో? ఎవరికి తెలియని చిదంబర రహస్యం. ఎవరైనా ఉన్నటువంటి ఆదాయానికి 10 శాతం లేదా 20 శాతం ఎక్కువ పనులు చేయిస్తారు. కానీ ఒక్క రూపాయి లేకుండా రు.70 కోట్ల పనులు చేయించి కాంట్రాక్టర్ల నెత్తిన టోపీ పెట్టారాని పనులు చేసిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. అది కూడా ఒంగోలులో స్థానికంగా ఉండే కాంట్రాక్టర్లకు కుచ్చుటోపి పెట్టి నరసాపురం, విజయవాడ ఇతర తన కాంట్రాక్టర్లకు మాత్రమే రు.2 కోట్ల చెల్లింపులు చేస్తున్న పట్టించుకోని దయనీయ పరిస్థితి ఒక్క ఒంగోలు కార్పొరేషన్ లోనే నెలకొన్నది. శాసన సభ్యులు ఏరి కోరి తెచ్చుకున్న కమిషనర్ కావడమే కారణం కావచ్చు.
చివరికి మీడియా కూడా వార్తలు రాసే వాళ్లే లేరు. ప్రధానమైన ప్రింట్ మీడియా కూడా ఒక్క వార్త రాయలేని నిస్సహాయ స్థితిలో ఉండటానికి కారణం బ్రహ్మదేవుడికే ఎరుక.
రెవెన్యూ విభాగంలో రేట్లు ఆకాశాన్ని అంటాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ పొందిన ఒక అధికారి అక్రమంగా డబ్బుని సంపాదించి ప్రధాన అధికారికి అందించే పనిలోనే కొనసాగుతున్నారు. అతనే శాసనసభ్యులకు నమ్మినబంటు కావడం విశేషం.
శానిటేషన్ విభాగంలో కూడా ఇదే తంతు. ఇంత విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్న, ప్రజలను జలగలుగా పీడిస్తున్న పట్టించుకునే నాధుడే లేడు. ఇది ఇలాగే ఉంటే శాసనసభ్యుని ప్రతిష్ట మసకబారుతుంది. దీని ఫలితాలు వచ్చే ఎన్నికల్లో కనబడతాయి. మరి ప్రజాప్రతితులు ఏమంటారు? షరా మాములేనని దులిపేసుకుంటారో? ఎలా స్పందిస్తారో? వేచి చూడాల్సిందే?






