చీరాల : కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మున్సిపల్ కౌన్సిలర్లు ఒక నెల గౌరవ వేతనాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. మున్సిపల్ ఛైర్మన్ మోదడుగు రమేష్‌బాబు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా కౌన్సిలర్ కన్నెగంటి శ్యామ్‌సన్ మాట్లాడుతూ పట్టణంలో ఎస్‌సి, ఎస్‌టిలకు రుణాలు మంజూరైనప్పటికీ బ్యాంకు అధికారులు మాత్రం షూరిటీలు లేవంటూ ఇవ్వడంలేదని సభ దృష్టికి తెచ్చారు. రూ.లక్ష డిపాజిట్‌లు చేస్తేనే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు లబ్దిదారులను తిప్పుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై బ్యాంకు అధికారులతో చర్చించాలని ఛైర్మన్‌ను, అధికారులను కోరడంతో బ్యాంకు అధికారులతో తక్షణం సమావేశం నిర్వహించి రుణాలు ఇచ్చేలా చూడాలని కమీషనర్ షేక్ ఫజులుల్లాను ఛైర్మన్ రమేష్ ఆదేశించారు. కౌన్సిల్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రమే బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
పట్టణంలో గృహనిర్మాణ పథకం పట్టణ లబ్దిదారులందరికీ అందేలా చూడాలని కౌన్సిలర్ పొదిలి ఐస్వామి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పట్టణాల్లో జిప్లస్ 3, జిప్లస్ 2 పథకం అమలు చేస్తున్నప్పటికీ చీరాల పట్టణంలో అనుమతి లేనందున వ్యక్తిగత గృహాలనే నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్పినప్పటికీ ధరకాస్తు చేసుకున్న మూడువేల మంది లబ్దిదారులకు ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాడైన వాహనాల వేలం టెండర్‌ను తిరిగి ఆక్షన్ నిర్వహించాలని తీర్మానించారు. 20వాహనాల వరకు ఉండగా కేవలం రూ.3.20లక్షలకే వేలం పాడటం కాదని, రీ ఆక్షన్ నిర్వహించాలని సూచించారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వస్తే మున్సిపాలిటీకి రూ.7లక్షల ఖర్చు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 7న చీరాల నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. చీరాల మున్సిపాలిటీలో ఎలాంటి కార్యక్రమం లేదు. కానీ ముఖ్యమంత్రి సభకు హాజరైన ప్రజానీకానికి అతిధి మర్యాదలు మాత్రం చీరాల మున్సిపాలిటీ నిధుల నుండే చేశారు. బహిరంగ సభకు హాజరైన ప్రజానీకానికి తాగునీటి పాకెట్లు, మజ్జిగ పాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసేందుకు అయిన రూ.7లక్షల ఖర్చును మున్సిపల్ సాధారణ నిధుల నుండి చెల్లించేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎస్‌సి ఉపప్రణాళిక నుండి మంజూరైన రూ.30కోట్ల నిధులలో రూ.13కోట్లు రోడ్లు, డ్రైన్లకు ప్రతిపాదించగా మిగిలిన రూ.17కోట్లతో స్మశానాల అభివృద్ది, జిమ్ములు, పిల్లల పార్కుల అభివృద్దికి ప్రతిపాదనలు పంపారు. సమావేశంలో కమీషనర్ షేక్ ఫజులుల్లా, డిఇ గణపతి పాల్గొన్నారు.