డిల్లీ : ఇటీవల దేశంలో జమిలీ ఎన్నికల అంశం ప్రతిచోటా చర్చకు వస్తున్నది. అందరం చూస్తున్నాం. ప్రధాని మోడీ నుండి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రాలు కలిసిరావాలని సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జమిలి ఎన్నికలు దేశంలో నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తేల్చేసింది. జమిలి ఎన్నికలు అసాధ్యమని చీఫ్ ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తేల్చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలంటే శాసనసభల గడువు తగ్గించడంగాని లేదా పెంచడంగాని చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియకు న్యాయపరమైన అంశాలు పూర్తి చేసేందుకు సమయం పడుతుందన్నారు. వీటన్నింటికీ తోడు వీవీప్యాట్ యంత్రాలు 100శాతం అందుబాటులో ఉండాలన్నారు. సమీప భవిష్యత్‌లో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలంటే అందుకు సరిపడా పోలీస్ యంత్రాంగం, పోలింగ్ సిబ్బంది ఉండాలని పేర్కొన్నారు. లోక్‌సభ, రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా న్యాయ కమిషన్‌కు లేఖ రాసిన రెండోరోజే ఎన్నికల కమిషనర్ రావత్ చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు వ్యతిరేకించిన నేపధ్యంలో న్యాయ కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
2019 సాధారణ ఎన్నికల కోసం ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), వీవీప్యాట్‌లను ఎన్నికల కమిషన్ సిద్దం చేస్తుంది. 13.95లక్షల బ్యాలెట్ యూనిట్లు, 9.3లక్షల కంట్రోల్ యూనిట్లు సెప్టెంబరు 30 నాటికి రానున్నాయి. 16.15లక్షల వీవీప్యాట్‌లు నవంబరు నెలాఖరుకు సిద్దమవుతాయని కమీషనర్ రావత్ తెలిపారు. ఎన్నిక టైమ్‌లో యంత్రాలు మొరాయించినచోట, తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చిన చోట వెంటనే వాటిని మార్చేందుకు మరికొన్ని వీవీప్యాట్‌లను సిద్ధం చేయాల్సి ఉందని తెలిపారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలంటే దాదాపు 24లక్షల ఈవీఎంలు అవసరమౌతాయని తెలిపారు.