బాపట్ల (DN5 News) : జనగణన నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలని సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. జనగణన 2026 నిర్వహణపై ఆర్డీఒలు, తహసిల్దార్లు, ఎండిఓలకు మూడు రోజుల శిక్షణను శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రారంభించారు. జనగణన పక్కాగా ఉండాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఆమె చెప్పారు. మే నెల నుంచి జనగణన మొదలుకానుందని అన్నారు. జిల్లాలో సమర్థంగా నిర్వహించడానికి 13 మంది జిల్లా అధికారులను కమిటీగా నియమించామని అన్నారు. తొలి విడతలో ఆర్డీఒలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఇదే క్రమంలో ఉపతహశీల్దార్లు, సహాయ గణాంకాల అధికారులు, సీనియర్ సహాయకులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
జనగణన ప్రక్రియ మే నెల 1నుంచి ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయని జనగణన సంయుక్త సంచాలకులు ప్రసన్న కుమార్ చెప్పారు. జనగణన ప్రక్రియ డిజిటల్ విధానంలో జరుగుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయాల సిబ్బంది జన గణనలో పాల్గొంటారని అన్నారు. డిజిటల్ విధానంలో చేపట్టే జనగణన పక్కాగా ఉండాలని అన్నారు. ఇందుకొరకే ప్రభుత్వం అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. జనగణనకు ప్రత్యేక యాప్‌లను ప్రవేశపెడుతుందని అన్నారు. భవనాలను గుర్తించడం, భవనాలకు సంఖ్య కేటాయించడం, యాప్‌ల ద్వారా వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఆర్డీఒ పి గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు, తహసిల్దార్లు, ఎండిఓలు పాల్గొన్నారు.






