బాపట్ల (DN5 News) : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పురోగతి సాధించడానికి అధికారులలో క్రమశిక్షణ, చురుకుతనం ఉండాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. చుండూరు మండలంలోని అన్ని శాఖల మండలస్థాయి అధికారులకు నైపుణ్యాలు మెరుగు పరిచే ప్రత్యేక శిక్షణ మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు.
విద్యా రంగంలో చండూరు మండలం పురోగతి లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండాలని అన్నారు. 22 మంది డ్రాప్ అవుట్స్ ఉండడంపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయడం లేదా అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తీర్ణత శాతం పెరగాలని అన్నారు. 15 సచివాలయాల పరిధిలో అక్షరాంధ్ర కార్యక్రమానికి 2,280 మందిని మాత్రమే ఎంపిక చేయడమేమిటని అన్నారు. నిరక్షరాస్యులైన వయోజనులు అందరినీ అక్షరాస్యులుగా చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని గుర్తించి తదనుగుణంగా పనిచేయాలని అన్నారు. ఆలపాడు సచివాలయ సిబ్బంది హాజరు సరిగా లేకపోవడం, పనితీరులో వెనుకబాటుపై నిలదీశారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాలలో సర్వేయర్ల డిప్యూటేషన్ రద్దు చేయాలన్నారు.
మండలంలోని యడ్లపల్లిలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులు పురోగతి లేకపోవడంపై ప్రశ్నించారు. కేవలం 66.78 శాతమే పనులు జరగడం, నిరుపేదలకు ఉపాధి కల్పించలేకపోవడంపై అరా తీశారు. పనుల ఎంపిక, తదితర అభివృద్ధిలో సచివాలయాల సిబ్బందిని వినియోగించాలని అన్నారు. అధికారులు క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. మీ విధులలో నిర్లిప్తత ఉండరాదని, పునరుత్తేజంతో పనిచేయాలని అన్నారు. మీరు పనిచేసే ప్రాంతాలలో మీ పట్ల ప్రజలలో విశ్వసనీయత పెంచాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే పురోగతిలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఉద్యానవన శాఖ ఏడి ఎంఎ కలీం, తహశీల్దారు, ఎంపిడిఒ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






